టిడిపి అభ్యర్థులపై కేసుల వివరాలు అందజేత

Apr 16,2024 15:15 #AP High Court, #judgement

ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో టిడిపి అభ్యర్థులపై నమోదైన కేసుల వివరాలను ఆ పార్టీ అభ్యర్థుల తరఫున పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్యకు అందజేసినట్లు పోలీసులు హైకోర్టుకు నివేదించారు. పిటిషనర్ల న్యాయవాదులకూ అందజేసినట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది మహేశ్వరరెడ్డి చెప్పారు. ఈ వివరాలతో సంతృప్తి చెందిన హైకోర్టు టిడిపి నేతలు దాఖలు చేసిన పిటిషన్లు పరిష్కారమైనట్లుగా ప్రకటించింది. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, అచ్చన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, నారాయణ, ధూళిపాళ్ల నరేంద్ర, వంగలపూడి అనిత, పల్లా శ్రీనివాసరావు, బొండా ఉమా, భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్‌ వేర్వేరుగా వేసిన పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె శ్రీనివాస్‌రెడ్డి మరోసారి విచారణ చేపట్టారు. ఎన్నికల్లో పోటీ చేయబోయే తమపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వడం లేదని పిటిషనర్ల వాదన తర్వాత ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో హైకోర్టు పిటిషన్లు పరిష్కారమైనట్లు ప్రకటించింది.
అలాగే మాజీ ఎంపి సుజనా చౌదరి, పరిటాల సునీత, గంటా శ్రీనివాసరావు, యార్లగడ్డ వెంకట్రావు, పరిటాల శ్రీరామ్‌ తదితరులు తమపై ఉన్న కేసుల వివరాలను పోలీసులు ఇవ్వడం లేదని వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. పోలీసుల వివరణ కోసం విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది.

➡️