పరిశోధనలకు పశు శరీర నిర్మాణ శాస్త్రం కీలకం

Dec 8,2023 17:54 #Animal Husbandry, #Tirupati
Animal anatomy is crucial in basic research

విక్రమ సింహపురి వర్సిటీ మాజీ విసి ఆచార్య జి.రాజారామిరెడ్డి

ప్రజాశక్తి – క్యాంపస్ : పశువుల ప్రాథమిక అంశాలపై పరిశోధనలు చేయడానికి పశు శరీర నిర్మాణ శాస్త్రం ఎంతగానో ఉపయోగపడుతుందని సింహపురి విశ్వవిద్యాలయం నెల్లూరు మాజీ ఉపకులపతి ఆచార్య జీ రాజారామిరెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలోని పశు వైద్య కళాశాల ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సు గురువారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశు శరీర నిర్మాణంలో వివిధ భాగాలను, వివిధ అంశాలను, పశువులలో వచ్చే వ్యాధులను నిర్ధారించేందుకు వివిధ రకాలైన ఆధునిక పద్ధతులను వినియోగించి పరిశోధనలో పురోగతి సాధించాలని పరిశోధకులకు సూచించారు. ఐఏవిఏ మాజీ సెక్రటరీ, ప్రెసిడెంట్ డాక్టర్ వ్యాస్, డాక్టర్ పివిఎన్ కిషోర్ లు మాట్లాడుతూ దేశంలో పశుసంపద వ్యవసాయ అనుబంధ రంగంగా ఎంతో కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. పాల ఉత్పత్తిని పెంచడంలోనూ, మాంసం దిగుమతులను, ఎగుమతులను పెంచడంలోనూ పరిశోధకులు చేసే పరిశోధనలు ఎంతో కీలకమన్నారు. సదస్సు కన్వీనర్ డాక్టర్ టిఎస్ చంద్రశేఖర రావు మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా పశు వైద్యశాస్త్ర రంగంలో వినూత్న పరిశోధనలకు ఇలాంటి జాతీయ సదస్సులు ఎంతో దోహదం చేస్తాయన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ జగపతి రామయ్య మాట్లాడుతూ పశు వైద్యులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలు కృషి ఫలితంగా దేశంలో పశుసంపద, పాడి ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శాంత లక్ష్మి, డాక్టర్ రాజా, డాక్టర్ సుప్రియ, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️