పండుగరోజూ పట్టువీడని అంగన్‌వాడీలు

Dec 25,2023 02:30

– కొవ్వొత్తుల ర్యాలీలు
– అంగన్‌వాడీల సమ్మెకు మాజీ మంత్రి ఆనందబాబు మద్దతు
ప్రజాశక్తి – కొల్లూరు
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అంగన్‌వాడీలు నిర్వహిస్తున్న సమ్మె ఆదివారం 13వ రోజు కొనసాగించారు. సమ్మె శిబిరంలో క్రిస్మస్ పండుగ కేక్ కట్ చేసి ప్రభువును ప్రార్థిస్తూ సిఎం జగన్మోహన్‌రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించి తమ సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని వేడుకొన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు బొనిగల సుబ్బారావు, సౌభాగ్యలక్ష్మి, నీరజ, భాగ్యం, జనసేన అధ్యక్షులు చలమయ్య, కోలా కుమార్, గరికిపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలు పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్యని సర్పంచ్ టి కృష్ణమోహన్ అన్నారు. అంగన్‌వాడి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో లబ్ధిదారులు, పిల్లలతో కూడా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామంలో జరిగిన కొవ్వుత్తల ర్యాలీలో అంగన్‌వాడీ టీచర్ శారద, వై బుజ్జి పాల్గొన్నారు.

అద్దంకి : అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మె ఆదివారం13వ రోజు క్రిస్టమస్ పండగ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అంగన్‌వాడీలు మాట్లాడుతూ క్రిస్టమస్ పండగ కానుకగానైనా అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. జగన్మోహన్‌రెడ్డికి క్రీస్తు జ్ఞానోదయం కలిగించాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వర్లు, సిఐటియు కార్యదర్శి జి శారద, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు మనోలత, జి వెంకటలక్ష్మి. వి ధనలక్ష్మి, టి పార్వతి, వి శారద, ఎన్ కవిత పాల్గొన్నారు.

రేపల్లె : అంగన్‌వాడీ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు మోకాళ్ళ మీద కూర్చుని ఆదివారం నిరసన తెలిపారు. అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాల కె ఝాన్సీ, సీఐటీయు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ సిఎం జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే నాలుగున్నరేళ్ల పాటు కాలంగడుపుతూ వచ్చారని అన్నారు. ఇచ్చిన హామీ అమలు చేయమని అడిగితే బెదిరింపులకు పాల్పడటం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలందరూ ముక్కోటి ఏకాదశి, క్రిస్మస్ పండగ జరుపుకుంటుంటే అంగన్‌వాడీలు మాత్రం రోడ్లమీద ఉన్నారని అన్నారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు మోకాళ్ళ మీద కూర్చుని నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ సిఐటియు నాయకులు నిర్మలజ్యోతి, దీప్తి, రజిని, సిఐటియు నాయకులు కె రమేష్ పాల్గొన్నారు.

భట్టిప్రోలు : అంగన్‌వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చేపట్టిన నిరవధిక సమ్మె 13వ రోజుకు చేరుకున్నప్పటికీ సిఎం జగన్మోహన్‌రెడ్డి పట్టినట్లుగా వ్యవహరించటం దారుణమని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద జరుగుతున్న అంగన్‌వాడీల నిరవధిక దీక్షకు ఆయన ఆదివారం మద్దతు ప్రకటించారు. అంగన్‌వాడీలను రక రకాల యాప్‌లతో మానసిక ఒత్తిడికి గురి చేస్తూ గౌరవ వేతనం మాత్రమే ఇస్తూ ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీలకు కనీస వేతనం ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి, రిటైర్మెంట్ బెనిఫిట్ అమలు చేయాలని అన్నారు. టిడిపి ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్లకు రూ.4600 నుండి రూ.10,500కు, ఆయాలకు రూ.6వేలకు వేతనం పెంచామని గుర్తు చేశారు. జగన్మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాక కేవలం రూ.వెయ్యి మాత్రమే పెంచి గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. 2018లో ఇచ్చిన జీవో నెంబర్ 18ని ఒకసారి పరిశీలించుకోవాలని సూచించారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకుండా కేంద్రాల తాళాలు ఇతర శాఖల ఉద్యోగులతో పగలగొట్టించడం దేశంలో ఎక్కడా లేని స్థితి ఏపీలో మాత్రమే కనిపిస్తుందని అన్నారు. అంగన్‌వాడీలు కన్నెర చేస్తే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితి దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. అంగన్‌వాడీల పోరాటానికి టిడిపి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా, టిడిపి మండల కన్వీనర్ వాకా శేషుబాబు, టిడిపి మాజీ కన్వీనర్ వై కరుణ శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు కుక్కల వెంకటేశ్వరరావు, నాయకులు వానపల్లి కోటేశ్వరరావు, దీపాల ప్రసాద్, కనపర్తి సుందర్రావు, యడ్ల జయశీలరావు, కంభం సుధీర్, సిఐటియు కార్యదర్శి జి సుధాకర్ ఉన్నారు.

కారంచేడు : అంగన్‌వాడీ కార్యకర్తలు ఆదివారం కూడా నిరసన దీక్ష కొనసాగించారు. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నిరాహార దీక్ష సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్టమస్ సందర్భంగానైనా సిఎం జగన్ ఏసుక్రీస్తు స్ఫూర్తితో తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. పండుగ సందర్భంగా కూడా తమ ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడి నాయకురాలు జి అనిత, మేరీ, హఫీజ, సిఐటియు జిల్లా నాయకులు పి కొండయ్య పాల్గొన్నారు.

వేమూరు : మండలం ఐలవరం గ్రామంలో ఆదివారం రాత్రి అంగన్వాడీలు క్యాండిల్ ర్యాలీ చేశారు. వేమూరు అంబేద్కర్ రక్షణ సైన్యం చర్చి నుండి లుదరన్ చర్చి వరకు, ఐలవరంలో ప్రధాన రహదారిలో క్యాండిల్ ర్యాలీ చేశారు. సిఐటియు నాయకులు బి ఆగస్టిన్ మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జి రాజకుమారి, జి అమల, ఇ రెబ్బమ్మ, చందోలు మాధవి, జి మల్లిక, రమాదేవి పాల్గొన్నారు.

సంతమాగులూరు : స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మె 13వ రోజుకు చేరుకుంది. ఆదివారం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు మస్తాన్ బి, శ్రీదేవి, మల్లేశ్వరి, ఎస్తేరురాణి, నిర్మల, ఆదెమ్మ, రమణ పాల్గొన్నారు.

➡️