తిరోగమనంలో ఆంధ్రప్రదేశ్‌ విద్యారంగం

Nov 29,2023 07:17 #Editorial

ఉపాధ్యాయుడికి టెక్నాలజీ ప్రత్యామ్నాయం కాదని ఇటీవల ‘యునెస్కో’ విడుదల చేసిన నివేదిక స్పష్టంగా పేర్కొన్నది. కరోనా తర్వాత స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌ల వాడకం పెరిగింది. కాని విద్యార్థికి సామాజిక విలువలు, క్రమశిక్షణ, సామాజికీకరణ టెక్నాలజీ ద్వారా సాధ్యం కాదన్నది అందరూ అంగీకరిస్తున్న విషయం. కాని రాష్ట్ర ప్రభుత్వం బైజూస్‌ కంటెంట్‌, ట్యాబ్‌లు, టీవీలు మొదలగు వాటిని ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయంగా తీసుకురావాలని భావిస్తున్నది. ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న ‘సాల్ట్‌’ ఒప్పందం దీనికి ఒక ప్రధాన కారణం.

పాఠశాల విద్యాశాఖ జీ.వో.నెం.117 ద్వారా ఉపాధ్యాయుల రేషనలైజేషన్‌ చేపట్టింది. రేషనలైజేషన్‌ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు తగ్గించటంతో పోస్టులు అదనంగా ఉన్నట్లు తేల్చారు. ఈ జీవో ద్వారా కూడా పనిభారాన్ని విపరీతంగా పెంచారు. స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం ఒక్కటే కొనసాగించి, తెలుగు మీడియం ఎత్తి వేయటంతో కొన్ని పోస్టులు రద్దయినాయి. అనేక చోట్ల ఉపాధ్యాయులు లేక పాఠశాలలు విశ్వసనీయత కోల్పోతున్నాయి. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి జీవో నెం.117 రద్దు చేయవలసిన అవసరముంది.

భారత రాజ్యాంగంలోని 45వ నిబంధన ’14 సంవత్సరాలలోపు పిల్లలందరికి ఉచిత, నిర్బంధ విద్య కల్పించాలని స్పష్టంగా పేర్కొన్నది. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21-ఎ నిబంధనలో ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చి, జాతీయ విద్యా హక్కు చట్టాన్ని రూపొందించింది. కాని 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత గత మూడు దశాబ్దాలుగా విద్యారంగంలో కూడా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చోటు చేసుకున్నాయి. విద్యారంగంలో రెండు సమాంతర వ్యవస్థలు కొనసాగుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ విద్యారంగం, రెండోవైపు ప్రైవేట్‌ విద్యారంగం కొనసాగటం విద్యారంగ అసమానతలకు దారితీసినది. 1997 నుంచి ప్రపంచ బ్యాంకు ప్రయోగాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రయోగశాలగా నిలిచింది. అప్పటి నుంచి విద్యారంగంలో కూడా ప్రపంచ బ్యాంకు ప్రభావం కొనసాగుతూనే ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లో 74 లక్షల మంది పిల్లలు పాఠశాలల్లో చదువుతుంటే సుమారు 40 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో, 34 లక్షల మంది ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్నారు.

ప్రస్తుత ప్రభుత్వం-ఉపాధ్యాయులపై దాడి

2019 మే లో ఏర్పడిన వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం పాఠశాలలో మౌలిక వసతులు కల్పించామని, అదే విద్యారంగ అభివృద్ధి అని ఊదరగొడుతున్నది. కాని ఆచరణలో ప్రభుత్వ విద్యారంగం, ప్రభుత్వ పాఠశాలలు నష్టపోయే చర్యలు చేపడుతున్నది. ఇంతకు ముందు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన బి.రాజశేఖర్‌, కమిషనర్‌గా పనిచేసిన వాడ్రేవు చినవీరభద్రుడు, ఇప్పుడు ముఖ్య కార్యదర్శిగా చేస్తున్న ప్రవీణ్‌ ప్రకాష్‌ వంటి అధికారులను ఉసికొల్పటం ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేయటం లేదనే వాతావరణాన్ని సృష్టించి, ప్రభుత్వ పాఠశాలలను దెబ్బ తీసే మార్గాన్ని ఎంచుకున్నది. ఐ.ఏ.యస్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌ గత 8 నెలలుగా తనిఖీల పేరుతో ఉపాధ్యాయులపై, విద్యాశాఖ అధికారులపై దాడి చేస్తున్నారు. అనేక వందల మందికి మెమోలు, చార్జ్‌ మెమోలు ఇస్తున్నారు. పదుల సంఖ్యలో సస్పెన్షన్లు చేశారు. ఆయన వైఖరితో ఉపాధ్యాయులే కాదు, విద్యాశాఖలో ఉన్నత స్థాయి అధికారులు కూడా సంతృప్తిగా లేరు. ప్రవీణ్‌ ప్రకాష్‌ను వెంటనే విద్యాశాఖ నుంచి బదిలీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాము.

జీ.వో నెం-17 : తరగతుల తరలింపు

పాఠశాల విద్యాశాఖ జీ.వో నెం.117 ద్వారా ఉపాధ్యాయుల రేషనలైజేషన్‌ చేపట్టింది. రేషనలైజేషన్‌ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు తగ్గించటంతో పోస్టులు అదనంగా ఉన్నట్లు తేల్చారు. ఈ జీవో ద్వారా కూడా పనిభారాన్ని విపరీతంగా పెంచారు. స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం ఒక్కటే కొనసాగించి, తెలుగు మీడియంను ఎత్తివేయటంతో కొన్ని పోస్టులు రద్దయినాయి. అనేక చోట్ల ఉపాధ్యాయులు లేక పాఠశాలలు విశ్వసనీయత కోల్పోతున్నాయి. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి జీవో నెం.117 రద్దు చేయవలసిన అవసరముంది. ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ ఏ మాత్రం హేతుబద్ధతలేని అసమంజసమైన నిర్ణయం చేసింది. 3 కిలోమీటర్ల లోపు ప్రాథమిక పాఠశాలలోని 3,4,5 తరగతులను హైస్కూల్‌కు తరలించాలనే నిర్ణయం ప్రాథమిక పాఠశాలల మనుగడను దెబ్బతీసింది. ఒక కిలోమీటరు లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను తరలించారు. ఉపాధ్యాయ సంఘాల ఉద్యమ ఫలితంగా అనేక పాఠశాలలను నిలుపుదల చేయించాము. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 12 వేలకుపైగా ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారాయి. తరగతుల తరలింపుకు వ్యతిరేకంగా పి.డి.ఎఫ్‌ ఎమ్మెల్సీలు చేసిన బస్సు యాత్రలో వేలాదిమంది తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. 3,4,5 తరగతుల తరలింపు జాతీయ విద్యా హక్కు చట్టానికి పూర్తి విరుద్ధం. 3,4,5 తరగతుల విద్యార్థులకు సెకండరీగ్రేడ్‌ ఉపాధ్యాయులు మాత్రమే బోధించాలని నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ స్పష్టంగా పేర్కొన్నది.

భర్తీ కాని ఉపాధ్యాయ పోస్టులు

దేశవ్యాప్తంగా 10 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ‘నీతి ఆయోగ్‌’ పేర్కొన్నది. మన రాష్ట్రంలో వై.యస్‌.జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డి.ఎస్‌.సి నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో సుమారుగా 30 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా 8,366 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ పాఠశాలలతో పాటు మున్సిపల్‌ పాఠశాలలు, మోడల్‌ స్కూళ్లు, గురుకులాలలో ఖాళీగా ఉన్న పోస్టులన్నిటిని భర్తీ చేయాలి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ కోసం బి.ఇడి, డి.ఇడి పూర్తి చేసిన అభ్యర్థులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.

టెక్నాలజీ ప్రత్యామ్నాయం కాదు

ఉపాధ్యాయుడికి టెక్నాలజీ ప్రత్యామ్నాయం కాదని ఇటీవల ‘యునెస్కో’ విడుదల చేసిన నివేదిక స్పష్టంగా పేర్కొన్నది. కరోనా తర్వాత స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌ల వాడకం పెరిగింది. కాని విద్యార్థికి సామాజిక విలువలు, క్రమశిక్షణ, సామాజికీకరణ టెక్నాలజీ ద్వారా సాధ్యం కాదన్నది అందరూ అంగీకరిస్తున్న విషయం. కాని రాష్ట్ర ప్రభుత్వం బైజూస్‌ కంటెంట్‌, ట్యాబ్‌లు, టీవీలు మొదలగు వాటిని ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయంగా తీసుకురావాలని భావిస్తున్నది. ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న ‘సాల్ట్‌’ ఒప్పందం దీనికి ఒక ప్రధాన కారణం. ‘సాల్ట్‌’ ఒప్పందం టెక్నాలజీ పాత్ర పెంచి, మానవ వనరుల పాత్ర తగ్గించాలని చెప్పింది. దీనిలో భాగంగానే ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఉపాధ్యాయుడికి టెక్నాలజీ సహాయకారిగా ఉంటుందిగాని, ప్రత్యామ్నాయం కాదని విద్యారంగ నిపుణులు, సామాజికవేత్తలు భావిస్తున్నారు.

ఉపాధ్యాయులు ఏం చేయాలి ?

ప్రవీణ్‌ ప్రకాష్‌ లాంటి వారిని చూసి కొంతమంది బెంబేలెత్తుతున్నారు. టెన్షన్‌ పడుతున్నారు. ఎందుకు ఈ టెన్షన్‌? అలాంటి వారు సంవత్సరమో రెండు సంవత్సరాలో ఉంటారు. కాని విద్యావ్యవస్థ పని చేసేది ఉపాధ్యాయులతో మాత్రమే. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు మాత్రమే విద్యా వ్యవస్థలో శాశ్వతం. ఈ మొత్తం ప్రక్రియ ప్రైవేటీకరణలో భాగంగా జరుగుతున్న పెద్ద నాటకం. ప్రైవేటీకరణ ఇంకా జరగాలని, ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి. దానికి ప్రభుత్వ విద్యా వ్యవస్థ సక్రమంగా పని చేయటం లేదనే బురదను ప్రవీణ్‌ ప్రకాష్‌ లాంటి వారి ద్వారా వేయిస్తున్నది.దీనికి ఒక్కటే మార్గం. మనం ప్రజల మద్దతు పొందాలి. చరిత్ర నిర్మాతలు ప్రజలే. మనం పని చేసే గ్రామాన్ని ప్రేమించాలి, గ్రామ ప్రజలను ప్రేమించాలి, పాఠశాలను ప్రేమించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, మన దగ్గర చదివే బిడ్డలను ప్రేమించాలి. వారందరి అభిమానం పొందాలి. అవసరమైతే పాఠశాలలో ఒక గంట అదనంగా గడపాలి. విద్యను సృజనాత్మకంగా బోధించాలి. పిల్లలతో మమేకం కావాలి. ఇలా చేసినప్పుడు మాత్రమే ప్రభుత్వ విధానాలు, ప్రైవేటీకరణ విధానాలను, ప్రవీణ్‌ ప్రకాష్‌ వంటి వారి చర్యలను ఓడించగలుగుతాం. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలనే నినాదాన్ని ఆచరణలో చూపిద్దాం.

( వ్యాసకర్త శాసనమండలి సభ్యులు, సెల్‌ : 8309965083) కె.యస్‌.లక్ష్మణరావు

➡️