నెస్లే ఉత్పత్తుల్లో అధిక చక్కెరపై దర్యాప్తు

Apr 20,2024 09:00 #Business

– ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐకు కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ : నెస్లే ఇండియా భారత్‌లో విక్రయించే బేబీ ఉత్పత్తుల్లో అధిక చక్కెర శాతం వుందన్న వార్తలను పరిగణనలోకి తీసుకొని తక్షణమే దర్యాప్తు చేపట్టాలని, ఆ కంపెనీపై తగిన చర్యలు తీసుకోవాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ)ను కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ మేరకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ సిఇఓ కమలా వర్ధనరావుకు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే లేఖ రాశారు. నెస్లే కంపెనీ భారత్‌, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాల్లో విక్రయించే బేబీ సెరిలాక్‌ ఉత్పత్తుల్లో నిర్దేశిత ప్రమాణాలకంటే అదనంగా 2.7 గ్రాములు) చక్కెరను అధికంగా కలుపుతోందని స్విట్జర్లాండ్‌కి చెందిన దర్యాప్తు సంస్థ ‘పబ్లిక్‌ ఐ’ ఒక నివేదికను ప్రచురించింది. జర్మనీ, స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ వంటి ఇతర దేశాల్లో మాత్రం ఇటువంటి పరిస్థితి లేదని, నెస్లే ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించింది. అధిక మోతాదులో చక్కెర ఉన్న పదార్థాలు తినడం వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందని, ఊబకాయం వంటి రుగ్మతలకు దారితీస్తుందని ‘పబ్లిక్‌ ఐ’ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.

➡️