అమ్మ బంగారం

Jan 21,2024 06:51 #Sneha, #Stories
amma bangaram story

ట్యూషన్‌ నుంచి ఏడు గంటలకు ఏడుపు మొహంతో ఇంటికి వచ్చింది మా ఎనిమిదేళ్ళ అమ్మాయి. అది చూసి అరుగు మీద కూర్చున్న నేను గబగబా వెళ్ళి ఎత్తుకుని అడిగాను ‘ఏమైంది మా బుజ్జి తల్లికి, ఎందుకు అదోలా ఉంది’ అని.

డాడీ మన ఇంట్లో కూడా నాన్నమ్మ ఉంటే బాగున్ను. నాకూ ఎంచక్కా చాక్లెట్లు కొని ఇచ్చేది. బోలెడు కథలు చెప్పేది. చూడు మా ఫ్రెండ్‌ వర్షిత వాళ్ళ నాన్నమ్మ రోజూ ఒక చాక్లైట్‌ వాళ్ళ మమ్మీ డాడీకి తెలియకుండా ఇస్తుందట. మమ్మీ డాడీలందరూ అంతే. నాకు జలుబు చేస్తుంది అని నువ్వూ ఇవ్వవు. మమ్మీ కూడా కొని ఇవ్వదు. నాకూ నాన్నమ్మ ఉంటే మీకు తెలియకుండా కొని ఇచ్చేదిగా.. నేనూ ఎంచక్కా బ్రేకులో వర్షితలా తినేదానినిగా’ అంది వెక్కి వెక్కి ఏడుస్తూ! అవునూ, నాన్నమ్మ మన ఇంట్లో ఎందుకు ఉండదు అని అడిగింది అమాయకంగా.

మా అమ్మాయి చాక్లెట్‌ కోసమే అడిగినా తను అడిగిన మాటలు నా గుండెలను గుచ్చినట్లు తాకాయి. నా చెంప మీద లాగిపెట్టి కొట్టినట్టు అనిపించాయి. ఒక్కసారిగా నా అలోచనలన్నీ పదేళ్ళ క్రితం జరిగిన పరిణామాలవైపు మళ్ళాయి.

‘మంచి సంబంధం అంటరా.. ఏ సంబంధం చూసినా ఏదో వంక పెడతావు. మీ నాన్నగారు చనిపోయి కూడా పదేళ్ళు అయిపోయింది. ఒక్కదాన్ని ఎన్ని అని చూడను. ఇంకా నీకు సంబంధాలు వెతకడం నా వల్ల కాదు. చేసుకుంటే ఈ సంబంధం చేసుకో.. లేదంటే ఇక నీవే చూసుకో. నా వల్ల కాదు’ అంది అమ్మ.

నేనూ లోలోపల పెళ్ళి చూపులు అని వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ చూసిన సంబంధాల్లో ఈ సంబంధం నచ్చింది. అందులోనూ అమ్మ అలా అనేసరికి ఇంక ఏమీ ఆలోచించకుండా సరే అనేసాను. మనసు చాలా తేలికపడినట్టుంది. నా మాటలకు అమ్మ సంతోషపడడం నేను చూసాను. నా దగ్గరగా వచ్చి బాబూ ఒక మాట.’పిల్ల మంచిది అని అందరూ చెబుతున్నారు. అయినా రేపు పెళ్ళైన తరువాత తనకి చెప్పకుండా మనం ఏమీ చెయ్యలేం. అలా చెయ్యడం ధర్మం కూడా కాదు. మీ అక్క చాలా ఇబ్బందుల్లో ఉంది అట. మా పుట్టింటి వారు పెట్టిన పది తులాల బంగారం మీ అక్కకి ఇచ్చేస్తాను. కుదువ పెట్టుకుంటుందో, అమ్ముకుంటుందో దాని జీవితం చక్కగా ఉంటే ఇక నేనూ సంతోషంగా కళ్లు మూస్తాను’ అంది.

ఎందుకో తెలియకుండానే అమ్మ మీద నాకు చాలా కోపమొచ్చేసింది. అంటే రేపు పెళ్ళి అయ్యాక నేను కట్టుకున్న దాని మాటలు విని నీ మాట వినననేగా ఇప్పుడు ఈ మాటలు చెబుతున్నావు. ఇదేనా నీ పెంపకం మీదున్న నమ్మకం, నా గురించి తెలుసుకున్నది ఇదేనా! అయినా సమయం సందర్భం లేకుండా ఇప్పుడు నేను పెళ్ళికి ఒప్పుకున్నాకే, అక్క సమస్యలు గుర్తొచ్చాయా? అని మాట మీద మాట గట్టిగా అమ్మమీద అరిచేశాను. ఆ తరువాత ఎప్పుడైనా తలుచుకుంటే, ఎందుకు అలా ప్రవర్తించానా అని చాలా బాధ పడిన సందర్భాలూ ఉన్నాయి.

అంతటితో గొడవ ఆగిపోయి ఉన్నా బాగున్ను. ఆ తరువాత అమ్మ ‘నా దగ్గర బంగారం ఎంతుందో నీకేమైనా తెలుసా? నీకు చెప్పకుండా మీ అక్కకి ఇచ్చినా నీకేమైనా తెలుస్తుందా? అలా చెప్పకుండా ఇవ్వడం కరెక్ట్‌ కాదు అనే నీతో చెప్పటం’ అంది. ఇంకా నా కోపం రెట్టింపు అయిపోయింది. ఆవేశంలో ‘ఇప్పుడు నిజం చెప్పు. అక్కా, నువ్వు కలిసి నా దగ్గర నాటకాలు ఆడుతున్నారా! నాకు తెలియకుండా ఎంత ధారపోశావో చెప్పు’ అని అనేశాను. అంతే! ఆ మాటకి అమ్మ ఎంత బాధ పడిందో తెలియదు. నా పెళ్ళి అయి ఇన్నేళ్లు అయినా పొడి పొడిగానే నాతో మాట్లాడుతుంది. ఆరోజే బంగారమంతా తెచ్చి నా ముందు పడేసి లోపలకి వెళ్ళిపోయింది. నేనే వాటిని తీసి ప్రక్కనే ఉన్న న్యూస్‌ పేపర్లో చుట్టి అమ్మ పక్కన ఉన్న బీరువాలో పెట్టేసి బయటకి వెళ్లి పోయాను. మా అమ్మాయి, నాన్నమ్మ మన ఇంట్లో ఉంటే బాగున్ను అనేసరికి ఇదంతా ఒక్కసారిగా నా ముందు మరలా కదలాడింది. పెళ్ళై ఊరు వదిలి వచ్చి పదేళ్ళు అయినా పండగకో పుణ్యానికో ఊరు వెళ్ళినా ఏ రోజూ అమ్మని మాతో రమ్మని గానీ, ఇక్కడ ఉండమనిగానీ అడగలేదు. తలచుకుంటుంటే నాకే సిగ్గేస్తుంది. పాపం నాన్న మిగిల్చిన ఆ ఎకరం పొలం కౌలుకిచ్చి వచ్చిన దానికి రేషన్‌తో కలిపి అలాగే బతికేస్తుంది. ఆ రోజే అమ్మని నేను క్షమించమని అడిగి ఉంటే అమ్మకీ, నాకూ మధ్య ఇంత దూరం పెరిగి ఉండేది కాదేమో! ఆ తరువాతయినా అప్పుడప్పుడు ఊర్లో వాళ్ళు చెప్పేవారు నిజంగానే మా అక్క పరిస్ధితి అప్పుడు బాగులేదని. మేము సహాయం చేసి ఉంటే వారి బతుకు ఇప్పుడు వేరేలా ఉండేదని. అప్పటికీ నేనెందుకో అక్కని గానీ, అమ్మని గానీ క్షమాపణలు కోరలేకపోయాను.

ఈ మధ్యే ఒక విషయం తెలిసి ఇంకా చాలా బాధ పడ్డాను. అక్క ఎప్పుడూ అమ్మని తన పరిస్థితి బాగులేదని చెప్పడం గానీ, బంగారం అడగడంగానీ చేయలేదని, అమ్మే తెలుసుకొని సహాయం చేద్దామనుకుందని. ఇప్పుడెందుకో మా అమ్మాయి వాళ్ళ నాన్నమ్మని గుర్తు చేశాక, ఇక ఆగలేకపోయాను. ఎలాగైనా రేపే మా ఊరు వెళ్ళి అమ్మని, అక్కని కలిసి మనస్ఫూర్తిగా క్షమించమని అడగాలి. ఆ తర్వాత అమ్మని పట్నం తీసుకొద్దామని నిర్ణయించుకొన్నాను. మా ఆవిడతో విషయం చెబుదామనుకునేలోగా టేబులు మీద ఉన్న ఫోన్‌ రింగు అయింది.

ఎప్పుడో మంచో చెడో కార్యక్రమాలకి గానీ చెయ్యని అక్క నుంచి వచ్చింది ఆ ఫోన్‌. ఏమో అని అనుకొని ‘హలో అక్కా’! అన్నాను. ‘తమ్ముడూ అమ్మ దగ్గర కొచ్చాను. అమ్మ ఎందుకో నిన్ను కలవరిస్తుందిరా. చూడాలని అంటుంది’ అంది. పొద్దున్నే బయలు దేరి వస్తానని చెప్పాను. ఎలాగూ నేను కూడా వెళ్దాం అనుకున్నా కదా! ఈసారి వర్షితను కూడా తీసుకొని బయలుదేరాను. నాన్నమ్మ దగ్గరకి అని చెప్పగానే ఎంత సరదా పడిందో! పిల్లల ఆనందాలను ఎంతగా దూరం చేస్తున్నానో అని నాకు అప్పుడు అనిపించింది.

మేము ఊరి పొలిమేరలు చేరేసరికే ఏవో ఏడుపుల శబ్దాలు వినిపిస్తున్నాయి. నాకెందుకో గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలైంది. ఒక్క ఉదుటున వేగాన్ని అందుకొని ఇంటికి చేరాము. నేను చేరేసరికి ఒక్కసారిగా ఏడుపులు పెరిగాయి. అక్క నన్ను పట్టుకొని అమ్మకోసం గట్టిగా ఏడుస్తుంది. నాకూ తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేసాయి. అమ్మని పట్టుకొని గట్టిగా ఏడ్చేసాను.

కార్యక్రమాలు అన్నీ అయిపోయాక నాలుగో రోజు, అమ్మ తాళాలు పెట్టే చోట నుండి తాళం చెవి తీసి, బీరువా తెరిచి చూశాను. ఒక్కసారిగా ఆశ్చర్యంతో గుండె ఆగింది. ఎన్నో ఏళ్ల క్రితం గొడవైనప్పుడు నేను పెట్టిన బంగారం, అదే పేపరులో అదే చోట అలానే ఉంది. అప్పటి నుండీ అమ్మ ఆ బంగారాన్ని ముట్టుకోలేదు. కన్నీళ్లు ఎంత ఆపుకున్నా ఆగలేదు. బంగారం లాంటి అమ్మని ఎంత క్షోభ పెట్టానో అని తలచుకుంటే.. నన్ను నేనే క్షమించుకోలేక పోయాను. ఆ రోజే క్షమించమని అడిగితే ఇంత వరకూ వచ్చేది కాదు కదా.. అని నాలో నేనే చాలా కుమిలిపోయాను. క్షమాపణలు అడగడానికి ఏ మాత్రం నిర్లక్ష్యం చేసి ఆలస్యం చేసినా, ఒక్కోసారి క్షమించే వారు ఇకలేక జీవితాంతం బాధ పడాల్సి రావొచ్చు అని తెలుసుకొనే సరికే చాలా ఆలస్యమైపోయింది. ఏం చేసుకోను అమ్మ లేని ఆ బంగారాన్ని?

– తిప్పాన హరి రెడ్డి, 94938 32412

➡️