లడఖ్‌కు రాజ్యాంగపరమైన రక్షణపై హామీ ఇవ్వని అమిత్‌ షా

న్యూఢిల్లీ : లడఖ్‌ ప్రాంతానికి రాజ్యాంగపరమైన రక్షణలపై హామీ ఇవ్వడానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నిరాకరించారు. ఈ విషయాన్ని లడఖ్‌ ప్రాంతానికి చెందిన పౌర సంఘాల నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. లేV్‌ా అపెక్స్‌ బాడీ (ఎల్‌ఎబి), కార్గిల్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ (కెడిఎ)కు చెందిన నాయకులు సోమవారం అమిత్‌షాతో సమావేశమయ్యారు. సమావేశంలో ఎలాంటి సానుకూల హామీ రాలేదని చెప్పారు. 2020 తరువాత ఈ సంఘాల నాయకులు అమిత్‌ షాను కలవడం ఇదే మొదటిసారి. ”ఈరోజు ఎల్‌ఎబి, కెడిఎ సబ్‌కమిటీ హోంమంత్రిత్వ శాఖ అధికారులు, లడఖ్‌ కేంద్రపాలిత సలహా దారులతో సమావేశాన్ని నిర్వహించింది. ఎలాంటి కచ్చితమైన ఫలితం లేకుండానే సమావేశం ముగిసింది. అనంతరం హోంమంత్రి అమిత్‌ షాతో ఆయన నివాసంలో సబ్‌కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశం ఎలాంటి సానుకూల ఫలితాన్ని ఇవ్వలేదు. రెండు జిల్లాల ప్రజలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ రెండు సంస్థలు భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తాయి” అని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో నాయకులు తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇందుకు విరుద్ధమైన ప్రకటన విడుదల చేసింది. కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌కు అవసరమైన రాజ్యాంగపర మైన రక్షణలను అందించడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటనలో తెలిపింది. 2023లో ఏర్పాటైన లడఖ్‌ హైపవర్డ్‌ కమిటీ రక్షణలను అందించడానికి విధివిధానాలను చర్చిస్తోందని పేర్కొంది.

➡️