ఈడి సమన్లపై జార్ఖండ్‌ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు

రాంచీ :    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) నోటీసులను ఎదుర్కొనేందుకు జార్ఖండ్‌ ప్రభుత్వం రాష్ట్ర అధికారులకు నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సోరెన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఒపి) రూపొందించింది. ఆ వివరాలను కాబినెట్‌ సెక్రటరీ వందనా దాదెల్‌ బుధవారం మీడియాకు తెలిపారు. నోడల్‌ హెడ్‌లకు తెలియజేయాలని తెలిపింది. జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ సహా పలువరు రాష్ట్ర అధికారులకు ఈడి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.  ఈ అంశాలను పరిష్కరించేందుకు, చట్టపరమైన చర్యలను తీసుకునేందుకు కాబినెట్‌ సెక్రటేరియట్‌, విజిలెన్స్‌ డిపార్ట్‌మెంట్‌లను నోడల్‌ డిపార్ట్‌మెంట్స్‌గా నియమించినట్లు తెలిపారు. నూతన ఎస్‌ఒపి నిబంధనల ప్రకారం.. ఎవరైనా అధికారి కేంద్ర దర్యాప్తు సంస్థల నుండి ఏదైనా నోటీసు లేదా సమన్లు అందుకుంటే, ఆ అధికారి వెంటనే సంబంధిత శాఖాధిపతికి తెలియజేయాల్సి వుంటుంది. నోడల్‌ డిపార్ట్‌మెంట్‌ తగిన న్యాయసలహా ఇస్తారని, దీంతో దర్యాప్తు సంస్థలకు ఆ అధికారి సహకారం అందిస్తారని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సమర్థ అధికారికి సమాచారం అందించకుండా కేంద్ర దర్యాప్తు సంస్థల ఎదుట హాజరు కావాలని నేరుగా అధికారులకు పలు  నోటీసులు లేదా సమన్లు జారీ చేసినట్లు రాష్ట్ర కాబినెట్‌ పలు సందర్భాల్లో తెలిపింది.

➡️