అంబానీ, అదానీ తొలిసారి జట్టు

Mar 28,2024 21:05 #Business

అదానీ పవర్‌ ప్రాజెక్ట్‌లో రిలయన్స్‌కు 26% వాటా
న్యూఢిల్లీ : భారత కార్పొరేట్‌ దిగ్గజాలు, ఇప్పటి వరకు ప్రత్యర్థి కుబేరులుగా కనబడుతున్న అంబానీ, అదానీలు తొలిసారి జట్టు కట్టారు. గౌతం అదానీకి చెందిన మధ్యప్రదేశ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌లో రిలయన్స్‌ ఇండిస్టీస్‌ 26 శాతం వాటాను సొంతం చేసుకుంది. అదానీ పవర్‌ లిమిటెడ్‌కు చెందిన పూర్తి అనుబంధ సంస్థ అయిన మహాన్‌ ఎనర్జెన్‌ లిమిటెడ్‌ (ఎంఇఎల్‌)లో రిలయన్స్‌ 5 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.10 ముఖ విలువతో తీసుకోవడం ద్వారా 26 శాతం వాటాను పొందింది.. అదే విధంగా క్యాప్టివ్‌ ఉపయోగం కోసం 500 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోనుంది. ఇందుకోసం ఇరు సంస్థల మధ్య కీలక ఒప్పందం జరిగినట్లు ఆ సంస్థలు గురువారం స్టాక్‌ ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చాయి. ”అదానీ పవర్‌ లిమిటెడ్‌కు చెందిన ఎంఇఎల్‌తో రిలయన్స్‌ ఇండిస్టీస్‌ క్యాప్టివ్‌ యూజర్‌ కింద 500 మెగావాట్ల కోసం 20 సంవత్సరాల దీర్ఘకాలిక విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రిసిటీ రూల్స్‌ 2005 పాలసీ ప్రకారం ఈ నిర్ణయం జరిగింది.” అని అని అదానీ పవర్‌ తన ఫైలింగ్‌లో తెలిపింది.
గుజరాత్‌కు చెందిన అంబానీ, అదానీలు ఇద్దరు తరచూ మీడియాలో ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నట్లు కనిపిస్తుంటారు. సంపద ఆర్జనలో ఆసియాలో ఒక్కరిపై ఒక్కరు పోటీపోటీగా వ్యవహారిస్తున్నట్లు బయటికి కనిపించినప్పటికీ.. అంతర్గతంగా వీరిద్దరి మధ్యలో చాలా సక్యత ఉందని తాజా ఒప్పందం సహా పలు ఘటనలు రుజువు చేస్తున్నాయి. చమురు, గ్యాస్‌, రిటైల్‌, టెలికాం తదితర రంగాల్లో అంబానీ ఆదిపత్యం కలిగి ఉన్నారు. విమానాశ్రయాలు, బగ్గు, మైనింగ్‌, మౌలిక వసతులు తదితర రంగాల్లో గుత్తాదిపత్యం కలిగి ఉన్నారు. ఇరువురు క్లీన్‌ ఎనర్జీ వ్యాపారంలో తప్పా మరే వ్యాపారాల్లోనూ పెద్దగా పోటీపడటం లేదు.
5జి స్పెక్ట్రం వేలంలో అదానీ గ్రూపు దరఖాస్తు చేసుకున్నప్పుడూ.. ఇరువురి మధ్య తీవ్ర పోటీ నెలకొననుందని అందరూ భావించారు. కానీ అంబానీలా కాకుండా, అదానీ 26 గిగాహెడ్జ్‌ బ్యాండ్‌లో కేవలం 400 మెగాహెడ్జ్‌ స్పెక్ట్రమ్‌ను మాత్రమే కొనుగోలు చేశారు. ఇదీ అదానీ కంపెనీల సొంత అవసరాలకు వినియోగించుకోవడానికి మాత్రమే. 2022లో ఎన్‌డిటివిని అదానీ స్వాధీనం చేసుకున్న సమయంలో ఇందులో అంబానీకి ఉన్న స్వల్ప వాటాలను అదానీకి స్వాధీనం చేయడం ద్వారా విక్రయ ప్రక్రియను సులభతరం చేశారు. మరోవైపు ఈ నెల ప్రారంభంలో జామ్‌నగర్‌లో అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు అదానీ కూడా హాజరయ్యారు. తాజా ఒప్పందం కార్పొరేట్‌ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

➡️