రేపటి నుండి అమరావతి బాలోత్సవ్‌ – పిల్లల పండుగ 

Dec 18,2023 16:13 #amaravati, #Balotsavam
amaravati balotsavam from tomorrow

55 అంశాల్లో పోటీలకు ఏర్పాట్లు

పోస్టర్‌ ఆవిష్కరణలో గౌరవాధ్యక్షులు చలవాది

ప్రజాశక్తి – ఎడ్యుకేషన్‌ (విజయవాడ) : అమరావతి బాలోత్సవం 6వ పిల్లల పండగ ఈ నెల 19, 20, 21 తేదీల్లో విజయవాడలోని సిద్ధార్ధ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు బాలోత్సవం గౌరవాధ్యక్షులు చలవాది మల్లికార్జునరావు తెలిపారు. నాలుగు జిల్లాల పరిధిలో జరిగే ఈ బాలోత్సవ్‌ పోస్టర్‌ను సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్లికార్జునరావు మాట్లాడుతూ.. ఎన్‌టిఆర్‌, కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల పరిధిలోని 175 పాఠశాలల నుండి సుమారుగా 10 వేల మంది విద్యార్థులు ఈ బాలోత్సవంలో పాల్గొననున్నారని తెలిపారు. 19న ఉదయం 10 గంటలకు ఎన్‌టిఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.సంపత్‌కుమార్‌ పిల్లల పండగను ప్రారంభిస్తారని, ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు, విశిష్ట అతిథులుగా రాష్ట్ర మైన్స్‌ అండ్‌ జియాలజీ డైరెక్టర్‌ వి.జి.వెంకటరెడ్డి, ఎన్‌టిఆర్‌ జిల్లా డిఇఒ సివి రేణుక, ఎస్‌బిఐ డిజిఎం మనీష్‌కుమార్‌ సింగ్‌, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ మిడ్‌టౌన్‌ అధ్యక్షులు సాధు విఆర్‌ ప్రసాద్‌ పాల్గొంటారని తెలిపారు. బాలోత్సవంలో 39 ఎకడమిక్‌, 16 కల్చరల్‌ ఈవెంట్లలో పోటీలు జరుగుతాయని తెలిపారు. బాలోత్సవం ప్రధాన కార్యదర్శి ఆర్‌.కొండలరావు మాట్లాడుతూ ఏకకాలంలో కళాశాల ప్రాంగణంలోనే 9 చోట్ల పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. బాలోత్సవం అధ్యక్షులు ఎస్‌పి.రామరాజు మాట్లాడుతూ ప్రతి విభాగంలో విజేతలకు మెమెంటో, సర్టిఫికెట్‌తోపాటు పోటీల్లో పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు.

➡️