తాజా పండ్లతో సదా ఆరోగ్యం

Always healthy with fresh fruits

శీతాకాల ప్రభావం తగ్గుముఖం పట్టి పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తినే ఆహారం, మంచినీరు కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువగా నీటిశాతాన్ని, ఖనిజ లవణాలూ ఉన్న పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఏ సీజన్లో శరీరానికి ఏమి అవసరమో అవే పండ్లను అందుబాట్లో ఉంచటం ప్రకృతి ధర్మం. పుచ్చకాయలు, కర్బూజాలు, తాటికాయలు, మామిడిపండ్లు … వేసవి మనకిచ్చే కానుకలు. వాటిని అవసరానికి తగ్గట్టు తీసుకుంటే- ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

మనం తినే ఆహారం మంచిగా ఉంటే ఆరోగ్యం మన సొంతమవుతుంది. కలుషిత, కల్తీ ఆహార పదార్థాల జోలికి వెళ్లకుండా ఉండటమే శ్రేయస్కరం. అయితే ఏది మంచి ఆహారం? ఏది కల్తీ ఆహారం? అనే విషయాలపై కాస్త అవగాహన ఉండటం మేలు. తాజాగా వండిన ఆహార పదార్థాలు ఎంతో మేలు. అలాగే తాజాగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు వంటివి వండి తింటే మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు.

బయటి తిండి వద్దు : ఎప్పుడైనా ఒకటి రెండు సార్లు మినహా పదే పదే స్ట్రీట్‌ ఫుడ్స్‌ తీసుకోవటం మంచిది కాదు. ఏదోక కారణంగా ఇంట్లో వంట చేయనప్పుడు, ఇతర ప్రాంతాలకు పనుల నిమిత్తం వెళ్లినప్పుడూ బయటి తిండి తప్పకపోవొచ్చు. కానీ, అదేపనిగా బయట తింటే అనారోగ్యాన్ని చేజేతులా కొని తెచ్చుకున్నట్లే. చాలామంది ఆకలేసినప్పుడు కడుపునింపుకోవటానికి కనబడిన స్నాక్స్‌ను లాగించేస్తుంటారు. ప్రాసెసింగ్‌ చేసిన ఆహారాన్ని, వేపుళ్లను (ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, నూడీల్స్‌) తింటుంటారు. ఇలాంటి ఆహారాల్లో ఉప్పు, చక్కెర ఎక్కువగా వాడేస్తుంటారు. అవి శరీరానికి కీడు చేస్తాయి. వీటికి ప్రత్యామ్నాయంగా తాజాపండ్లు తీసుకోవటం ఆరోగ్యానికి ఎంతో మేలు. స్నాక్స్‌ తినాలని భావించినప్పుడు ఏదో ఒక పండును తీసుకోవడం మంచిది. చిప్స్‌, కేకులు, మిర్చి బజ్జీలు, ఉప్పు కలిపిన పదార్థాలు లాంటివి నివారించటం చాలా అవసరం. వాటికి బదులుగా పండ్లు, బాదంపప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, వాల్‌నట్స్‌ లాంటివి తీసుకుంటే శరీరానికి ప్రొటీన్లు, మంచి కొవ్వులు లభించి అదనపు శక్తినిస్తాయి.

ఆకుకూరలు, కూరగాయలు : పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ధాన్యాలు, పప్పులతోపాటుగా బాదం, జీడిపప్పు వంటి గింజపప్పులు (నట్స్‌), ఖర్జూరం, కిస్‌మిస్‌, అంజీరా వంటి ఎండు ఫలాల్లోనూ పోషకాహారం ఉంటుంది. మేలిరకం కొవ్వులు, విటమిన్లతోపాటు ఫాస్పరస్‌, రాగి, ఇనుము, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎండుపండ్లలో దండిగా ఉంటాయి. ఇవన్నీ కీలకమైన అవయవాలు సరిగా పనిచేసేలా కాపాడతాయి. రకరకాల జబ్బుల బారినపడకుండా కాపాడతాయి.పోషకాలు, విటమిన్లు : ప్రతిఒక్కరూ తమ శరీరానికి రోగాల నుంచి కాపాడుకునే శక్తిని పెంపొందించుకోవాలి. దానికి అవసరమైన పండ్లను గుర్తించి తినటం ఎంతో మేలు. తాజా పండ్లలో రకరకాల పోషకాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. బొప్పాయి, అరటి, మామిడి, జామ, సీతాఫలం, లేత పసుపు రంగు గల పండ్లలో విటమిన్‌ ఎ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవటం ద్వారా రోగ నిరోధక శక్తి బలోపేతమవుతుంది. బత్తాయి, నారింజ వంటి పండ్లను తీసుకుంటే జలుబు చేస్తుందనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ అది నిజం కాదని వైద్య నిపుణులు ఎప్పుడో ధృవీకరించారు.

మొలకెత్తిన విత్తనాలు : వివిధ పండ్లతోపాటుగా మొలకెత్తిన గింజలు తిన్నా శరీరానికి అదనపు శక్తి చేకూరుతుంది. శాకాహారం తినేవారిలో బి12 లోపం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వారు ఉసిరి, క్యారెట్‌, ఖర్జూరం వంటి డ్రైఫ్రూట్‌ను తీసుకుంటే అనేక రకాల పోషకాలు శరీరానికి లభిస్తాయి. వాటిని జ్యూస్‌ రూపంలో కూడా తీసుకోవచ్చు.

ఫైబర్‌, ప్రొటీన్లు : శరీరానికి శక్తి కావాలంటే నిర్ధిష్ట మొత్తంలో కేలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రస్తుత జీవనశైలి ప్రకారం ప్రతిరోజూ 1600 నుంచి 1800 కేలరీలు ఉండే ఆహారాన్ని తీసుకుంటే సరిపోతుంది. డ్రైఫ్రూట్స్‌, పెరుగు పదార్థాలను తీసుకుంటే శరీరానికి ఫైబర్‌, ప్రొటీన్లతోపాటు మంచి కేలరీలు అందుతాయి. చిన్నపిల్లలు, గర్భవతులు, పాలిచ్చే తల్లులు, గర్భవతులకు పోషకాలు ఎక్కువగా కావాలి. వారు ఎక్కువగా పండ్లు, పాలు, డ్రైఫ్రూట్స్‌ వంటివి తీసుకోవాలి. మధుమేహం ఉన్న వారికి సరిపడా కేలరీలు ఉన్న ఆహారమే ఇవ్వాలి. ప్రతిఒక్కరూ తాము చేసే పనినిబట్టి, శ్రమను బట్టి కూడా కేలరీల అవసరం మారుతుంటుంది. ఎక్కువగా పనిచేసే వారు ప్రతిరోజూ 2200 కేలరీల ఆహారం తీసుకోవచ్చు.

 

మాంసాహారం : శరీరానికి అవసరమైన కేలరీలు మాంసాహారంలో అధికంగా ఉంటాయి. అలాగని అధికంగా తింటే కొవ్వు పదార్థాలు ఎక్కువ జమ అవుతాయి. వారానికొకసారి లేదా రెండుసార్లు తినటం మంచిది. ప్రొటీన్లు, ఎ, డి, ఇ విటమిన్లు, కొవ్వులు ఉండే కోడిగుడ్లు తగినన్ని తీసుకోవాలి. కేలరీలు తగ్గించుకోవాలంటే పంచదార, స్వీట్లు, ఫ్రైఫుడ్‌, కూల్‌డ్రింకులు, కేకులు, ఐస్‌క్రీములు, పిజ్జాలు, బర్గర్లు, ఆల్కహాల్‌ వంటివి తీసుకోకూడదు.

➡️