చదువుతో పాటు ఆట,పాట – బాలోత్సవంలో ప్రభాకర్‌రెడ్డి

Jan 6,2024 08:30 #balostavalu

ప్రజాశక్తి- వైఎస్‌ఆర్‌ ప్రతినిధి:పిల్లల్లో ప్రతిభను వెలికితీసేందుకు బాలోత్సవం తోడ్పడుతోందని వైఎస్‌ఆర్‌ జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి అంబవరం ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కడప మరియాపురం సెయింట్‌ జోసెఫ్‌ హైస్కూల్‌లో కడప బాలోత్సవం ప్రథమ పిల్లల పండగ కార్యక్రమాన్ని బాలోత్సవం కమిటీ అధ్యక్షులు జి.గోపాల్‌, ఉపాధ్యక్షులు డాక్టర్‌ సి.ఓబుల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ రాహుల్‌, కార్యదర్శి బి.లక్ష్మీ రాజా ఆధ్వర్యంలో రెండురోజుల పాటు జరగనున్న కార్యక్రమాన్ని తొలిరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు ఆటలు, పాటలు, మాటలలో మంచి నైపుణ్యం పొందాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి వై.రాఘవరెడ్డి మాట్లాడుతూ.. ఈ సమాజంలో బాల బాలికల హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు. గోపాల్‌ మాట్లాడుతూ.. విద్యార్థులలో దాగి ఉన్న సామర్థ్యాలను వెలికి తీయడానికి కడప బాలోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. 43 రకాల యాక్టివిటీస్‌తో అకాడమిక్‌, నాన్‌ అకాడమీక్‌ ముఖ్యంగా జానపద నృత్యం, ఏకపాత్రాభినయం, లఘు నాటిక శాస్త్రీయ నృత్యం, దేశభక్తి గీతాలాపన, వ్యాసరచన పోటీలు లాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలిగించే రీతిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. లక్ష్మీరాజా, ఓబుల్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️