పారిశుధ్య కార్మికులకు అలవెన్స్ అందజేత

Mar 1,2024 00:14

ప్రజాశక్తి – భట్టిప్రోలు
భట్టిప్రోలు పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులకు ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత వివిధ రకాల ఆలవెన్సులను గురువారం అందజేశారు. పంచాయతీ పాలకవర్గం ఏర్పడిన తరువాత తొలిసారిగా ఎక్కడ లేని విధంగా పెద్ద మొత్తంలో అలవెన్సులు కార్మికులకు ముట్ట చెప్పారు. పంచాయతీలో పనిచేస్తున్న 30మంది కార్మికులకు ఒక్కొక్కరికి 24 సబ్బులు, రెండు జతల చెప్పులు, మూడు కొబ్బరినూనె సీసాలు, గ్లౌజులు, యూనిఫామ్ దుస్తులు అందజేశారు. వీటిని సర్పంచ్ ధారా రవికిరణ్మయి, కార్యదర్శి కోట శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ బర్లే రాంప్రసాద్, పాలకవర్గ సభ్యుల చేతుల మీదగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి ఏట అందించాల్సిన ఈ పాలవెన్స్‌ల పంపిణీలో కొంత జాప్యం జరిగిందని అన్నారు. అయినాప్పటికీ కార్మికుల సేవలను దృష్టిలో ఉంచుకొని వారికి ఏడాదికి సరిపోయే విధంగా సుమారు రూ.1.90లక్షల వ్యయంతో వీటిని అందజేస్తున్నట్లు తెలిపారు. కార్మికులకు వేతనాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో చెన్నయ్య, భూషణరావు పాల్గొన్నారు.

➡️