జ్ఞానవాపి మసీదు కమిటీ పిటిషన్‌పై విచారణ వాయిదా.. వారణాసిలో హై అలర్ట్

న్యూఢిల్లీ :   జ్ఞానవాపి మసీదుపై వారణాసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ అంజుమాన్‌ ఇంతేజామియా మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై అలహాబాద్‌ హైకోర్టు శుక్రవారం విచారణను వాయిదా వేసింది. ఫిబ్రవరి 6న విచారణ చేపట్టనున్నట్లు జస్టిస్‌ రోహిత్‌ రంజన్‌ అగర్వాల్‌ ఈ ఆదేశాలు జారీ చేశారు. వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా మసీదు కమిటీ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే.  హైకోర్టుకు వెళ్లాలని సూచించడంతో మసీదు కమిటీ అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించింది.

వారణాసిలో హై అలర్ట్ 

జిల్లా కోర్టు ఆదేశాల తర్వాత వచ్చిన మొదటి శుక్రవారం నమాజ్‌ సందర్భంగా వారణాసి జిల్లాలో హై అలర్ట్‌ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా భారీగా పోలీసులను మోహరించారు. దుకాణాలతో పాటు ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాలను మూసివేశారు. పొరుగు జిల్లాల నుండి అదనపు బలగాలను రప్పించినట్లు పోలీస్‌ కమిషనర్‌ అశోక్‌ జైన్‌ తెలిపారు. కాశీవిశ్వనాథ్‌ ధామ్‌, సమీప ప్రాంతాల్లో ర్యాపిడ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఆర్‌పిఎఫ్‌) దళాలను మోహరించామని అన్నారు.

కాగా, వారాణాసి కోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తూ జ్ఞానవాపి మసీదు కమిటీ శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది. దాల్మండి, నాయి సడక్‌, నాడేసర్‌, అర్దాల్‌ బజార్‌ ప్రాంతాతో పాటు ముస్లింలు అధికంగా ఉండే మార్కెట్‌ ప్రాంతాల్లో బంద్‌ ప్రభావం కనిపిస్తోంది.

➡️