2న అఖిల పక్ష సమావేశం

Nov 27,2023 10:04 #All Parties Meeting
all party meeting on dec 2

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరోపార్లమెంట్‌ శీతాకాల సమావేశాల సందర్భంగా డిసెంబర్‌ 2న కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 4 నుంచి 22 వరకు నిర్వహించనున్న సంగతి విదితమే. సాధారణంగా పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ డిసెంబర్‌ 3న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న దరిమిలా 2వ తేదీన అంటే పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి రెండు రోజులు ముందుగానే అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తుండటం విశేషం. శీతాకాల సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదించడానికి ప్రభుత్వం సంసిద్ధమైంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రాపై వచ్చిన ”క్యాష్‌ ఫర్‌ క్వరీ” ఆరోపణలపై ఎథిక్స్‌ కమిటీ నివేదికను లోక్‌సభ సెషన్‌లో ప్రవేశపెట్టనున్నారు. ప్యానెల్‌ సిఫార్సు చేసిన బహిష్కరణ అమలులోకి రాకముందే సభ నివేదికను ఆమోదించాల్సివుంటుంది. ఐపిసి, సిఆర్పిసి, ఎవిడెన్స్‌ యాక్ట్‌ స్థానంలో మూడు కీలక బిల్లులను కూడా ఈ సెషన్‌లోనే పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. హాంశాఖ వ్యవహారాలకు సంబంధించిన స్థాయీ కమిటీ ఇప్పటికే ఈ మూడు బిల్లులకు ఆమోదం తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన మరో కీలక బిల్లు కూడా పార్లమెంటులో పెండింగ్‌లో ఉంది. వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పటీకి ప్రతిపక్షాలు, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ల నిరసనల మధ్య పార్లమెంటు ప్రత్యేక సెషన్‌లో ఆమోదానికి రాలేదు.

➡️