సంకీర్ణం కోసం ముమ్మర యత్నాలు – అటు ఇమ్రాన్‌ , ఇటు నవాజ్‌ షరీఫ్‌

Feb 14,2024 10:25 #Imran Khan, #Nawaz Sharif, #Pakistan

ఇస్లామాబాద్‌ : మజ్లిస్‌-వదాత్‌-ఇ- ముస్లిమీన్‌ (ఎండబ్ల్యుఎం), జమాతే ఇస్లామీ పార్టీలతో కలసి కేంద్రంలోను, ఖైబర్‌ ఫక్తూన్‌ఖ్వా రాష్రంలోను ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించాలని, కలిసొచ్చే ఇతర పార్టీలను కలుపుకుని పోవాలని పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ (పిటిఐ) నేత, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తన పార్టీ సహచరులకు సూచించారు. జైలులో తనను కలిసిన న్యాయవాదుల ద్వారా ఆయన ఈ సందేశాన్ని పంపారు. పంజాబ్‌ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలని సూచించారు. పిపిపి, పిఎంఎల్‌ (ఎన్‌) ఒకే నాణేనికి రెండు పార్శ్వాలని, దేశంలో ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకోవడానికి, ఆర్థిక వ్యవస్థ నాశనానికి ఈ రెండు పార్టీలే కారణమని ఇమ్రాన్‌ విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో పిటిఐ మద్దతుతో గెలుపొందిన ఇండిపెండెంట్లే అతిపెద్ద గ్రూపుగా అవతరించారు. ఆ తరువాతి స్థానాల్లో నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పిఎంఎల్‌ (ఎన్‌) -75, బిలావల్‌ భుట్టో జర్దారీ (పిపిపి) -54 నిలిచాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 133 స్థానాలు ఏ పార్టీకి లభించకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు అనివార్యమైంది. ఎవరు ఎవరితో కలుస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు. పాక్‌ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న సైన్యం ఇమ్రాన్‌ ఖాన్‌ను అధికారంలోకి రానీయకుండా చేసేందుకు ఎన్నికల్లో రిగ్గింగ్‌, అక్రమాలకు పాల్పడిందని, ఫలితాల తరువాత కూడా అదేరకమైన కుతంత్రాలను పన్నుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. నవాజ్‌ షరీఫ్‌కు సైన్యం వెనక ఉండి ప్రోత్సహిస్తోంది. పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీతో కలసి పిఎంఎల్‌(ఎన్‌) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చర్చలు ప్రారంభించింది. ఇమ్రాన్‌ మద్దతుతో గెలిచిన ఇండిపెండెంట్లలో కొందరిని నవాజ్‌ షరీఫ్‌ ఇప్పటికే తన శిబిరంలోకి లాక్కున్నారు. పిపిపి నేత బిలావల్‌ తన తండ్రి అసిఫ్‌ జర్దారీకి దేశ అధ్యక్ష పదవి ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారు. ఇప్పుడు తన వైఖరిని కొంత సడలించుకుని సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని, అయితే, మంత్రి పదవులు తీసుకోబోమని, బయట నుంచే అంశాలవారీ మద్దతు ఇస్తామని పిపిపి నేత చెప్పారు. ప్రజా తీర్పును గౌరవించి పిటిఐ నేతృత్వంలో ఏర్పడే సంకీర్ణానికే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలనేది నిపుణుల అభిప్రాయం. దీనికి భిన్నంగా తీసుకునే ఏ చర్య అయినా అది దేశంలో కల్లోలం సృష్టించే అవకాశముందని వారు హెచ్చరించారు.

➡️