అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల పోస్టర్‌ విడుదల

Nov 28,2023 16:31 #Kurnool

ప్రజాశక్తి – గోనెగండ్ల (కర్నూలు) : అఖిలభారత కిసాన్‌ సభ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలను జయప్రదం చేయాలని కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్‌ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం గోనెగండ్ల మండల కేంద్రంలోని బస్టాండ్‌ ఆవరణంలో ఏఐకేఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల పోస్టర్‌ను కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు బి కరుణాకర్‌, ఏపీడబ్ల్యూజేఎఫ్‌ తాలుక ఉపాధ్యక్షులు దండు ఖాజా, కాటికాపరి గుంతలు తీసే బేగరుల సంఘం జిల్లా నాయకులు ప్రకాశం, స్థానిక రైతులతో కలిసి కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్‌ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతుకు ఈ పాలకులు సున్నం పెడుతున్నారన్నారు. పంట పెట్టుబడి దగ్గర నుండి పెరిగే క్రమంలో పిచికారీ మందులు,కూలీలు ఇతర ఖర్చులు విపరీతంగా పెరిగాయన్నారు.తీరా పంట చేతికి వచ్చాక, మార్కెట్‌ సదుపాయం లేక, గిట్టుబాటు ధర రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.అందుకే రైతులకు తోడుగాపోరాటానికి మద్దతుగా అన్ని సంఘాలు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామన్నారు. స్వాతంత్య్ర ఉద్యమం తర్వాత అంతటి పెద్ద ఉద్యమాన్ని సంవత్సరం పాటు ఢిల్లీ సరిహద్దుల్లో నిర్వహించిన రైతు ఉద్యమ నాయకులంతా కరువు జిల్లా గా ఉన్న కర్నూలుకు 15న రాబోతున్నారన్నారు. 15న రైతు ప్రదర్శన, బహిరంగ సభలు నిర్వహించి, మూడు రోజులపాటు కరువు పైన ప్రాజెక్టుల పైన రైతుల అన్ని రకాల సమస్యల పైన సమూల చర్చను నిర్వహిస్తారన్నారు. దేశానికి వెన్నెముక అయిన రైతుకు దన్నుగా నిర్వహించబోయే అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలకు అత్యధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.

➡️