పంజాబ్‌లో అఖిల భారత రైతు సదస్సు

  • ఎస్‌కెఎం సమన్వయ కమిటీ నిర్ణయం

న్యూఢిల్లీ : పంటలకు కనీస మద్దతు ధర , రైతులకు రుణ విముక్తి వంటి తమ డిమాండ్ల సాధనకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు వచ్చే నెలలో పంజాబ్‌లో అఖిల భారత రైతు సదస్సు జరగనుంది. రెండు రోజుల పాటు ఇక్కడ జరిగిన సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) జాతీయ సమన్వయ కమిటీ, జనరల్‌ బాడీ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విద్యుత్‌ ప్రైవేటీకరణ, ఒలింపిక్‌ పతక విజేత, ప్రముఖ మహిళా రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ పోరాటం, ప్రతిపక్ష ఎంపీలపై సామూహిక సస్పెన్షన్‌, పార్లమెంటులో నిరసన తెలిపిన యువకులపై ఉపా కింద కేసులు బనాయించడం, ఎన్నికల కమిషనర్‌ నియామక కమిటీ నుంచి ప్రధాన న్యాయమూర్తిని తొలగించడం వంటి అంశాలపైనా ఈ సదస్సు కేంద్రీకరిస్తుందని సమన్వయ కమిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. కార్పొరేట్‌ ఆధిపత్య విధానాల వల్ల సంక్షోభంలో పడిన వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యామ్నాయ విధానాలను ఈ సదస్సు ముందుకు తెస్తుందని తెలిపింది. కార్పొరేట్‌- హిందూత్వ పొత్తుకు వ్యతిరేకంగా రైతుల ఐక్యతను మరింత పటిష్టపరచాలని కోరింది. లఖింపూర్‌లో రైతులను కారుతో తొక్కించి చంపిన కేసులో పాత్ర ధారి అజరు మిశ్రాను కేబినెట్‌ నుంచి తొలగించాలన్న డిమాండ్‌ను ఎస్‌కెఎం పునరుద్ఘాటించింది. మహిళా రెజ్లర్ల పట్ల కీచకుడిగా మారిన భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ తన సన్నిహితుడ్ని రెజ్లింగ్‌ చీఫ్‌ను చేయడాన్ని నిరసిస్తూ సాక్షిమాలిక్‌ రెజ్లింగ్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం, ఆమెకు మద్దతుగా బజరంగ్‌ పునియా, వీరేంద్ర సింగ్‌ వంటి రెజ్లర్లు పద్మశ్రీ అవార్డులను వాపసు చేయడం ప్రధాని నరేంద్ర మోడీకి గట్టి ఎదురు దెబ్బ అని ఎస్‌కెఎం పేర్కొంది.

➡️