కోవిడ్‌పై అప్రమత్తం : రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖ

Dec 19,2023 09:20 #Alert, #center, #covid, #letter, #States, #Union

న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల కోవిడ్‌-19 కేసులు పెరుగుదల, జెఎన్‌.1 వేరియంట్‌ మొదటి కేసును దేశంలో గుర్తించిన నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కోవిడ్‌ పరిస్థితిపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య కార్యదర్శులకు సోమవారం రాసిన లేఖలో పేర్కొంది. జిల్లాలవారీగా ఎస్‌ఎఆర్‌ఐ, ఐఎల్‌ఐ కేసులను క్రమం తప్పకుండా నివేదించాలని, పర్యవేక్షించాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఆర్‌టి – పిసిఆర్‌ పరీక్షలను అధిక సంఖ్యలో చేయడంతోసహా తగినన్ని పరీక్షలు చేయాలని కోరింది. పాజిటివ్‌ శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం ఐఎన్‌ఎస్‌ఎసిఒజి ప్రయోగశాలలకు పంపాలని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులపై ఆరోగ్యశాఖ అధికారులు గట్టి నిఘా ఉంచాలని సూచించింది. జ్వరపీడితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతీలో నొప్పి, రక్తపోటు తగ్గడం, ఆహారం తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు వైద్యులను సంప్రదించాలని కేంద్రం కోరింది. అనుమానిత కోవిడ్‌-19 లక్షణాలు ఉన్న వ్యక్తులు ల్యాబ్‌ల్లో పరీక్షలు చేసుకోవాలని కేంద్రం సూచించింది.

24 గంటల్లో 260 కేసులు

దేశంలో సోమవారం ఉదయం నాటికి గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 260 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం క్రియాశీల కేసులు 1,828కు చేరుకున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకూ మొత్తంగా 5,33,317 కరోనా మరణాలు సంభవించాయని తెలిపింది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,50,05,076గా ఉంది.

➡️