ప్రతిపక్షాలపై ఆగని కేంద్రం దాడులు .. అఖిలేష్‌ యాదవ్‌కి సిబిఐ సమన్లు

Feb 28,2024 15:19 #akhilesh yadav, #CBI, #summoned

న్యూఢిల్లీ : ప్రతిపక్షాలపై కేంద్రం దాడులకు దిగుతోంది. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) 8 సార్లు సమన్లు జారీ చేసింది.   జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ని కూడా అవినీతి ఆరోపణలపై అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.  తాజాగా అక్రమ మైనింగ్‌ కేసులో సమాజ్‌ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సిబిఐ) బుధవారం సమన్లు జారీ చేసింది.  సాక్షిగా విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొంది.  గురువారం దర్యాప్తు సంస్థ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అఖిలేష్‌ యాదవ్‌ 2012 నుంచి జూన్‌, 2013 మధ్య మైనింగ్‌ శాఖను నిర్వహించాడు.

ఉత్తరప్రదేశ్‌లోని ఏడు జిల్లాలు, షామ్లీ, కౌశాంబి, ఫతేపూర్‌, డియోరియా, సహరాన్‌పూర్‌, హమీర్‌పూర్‌ మరియు సిద్ధార్థనగర్‌లో అక్రమ మైనింగ్‌ కేసులు నమోదయ్యాయి. 2012 నుంచి 2016 మధ్య కాలంలో నిబంధనలను పాటించకుండా ప్రభుత్వ అధికారులు కొన్ని అక్రమ మైనింగ్‌ స్థలాలను కేటాయించారని ఆరోపణలు ఉన్నాయి. ఎన్‌జీటీ ఆదేశాలను ఉల్లంఘించి మైనింగ్‌ హక్కులు కూడా ఇచ్చారని సిబిఐ పేర్కొంది.

లక్నో : సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షులు, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ గురువారం సిబిఐ విచారణకు హాజరుకాలేదు. మైనర్‌ ఖనిజాల అక్రమ మైనింగ్‌ కేసులో గురువారం విచారణకు హాజరుకావాలని అఖిలేష్‌కు బుధవారం సిబిఐ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా గురువారం విచారణకు హాజరుకాలేనని, విచారణకు అన్ని విధాల సహకరిస్తానని తన న్యాయవాది ద్వారా సిబిఐకి అఖిలేష్‌ యాదవ్‌ సమాచారం ఇచ్చారు. సిబిఐని ఎదుర్కోవడం కొత్త కాదు : అఖిలేష్‌గురువారం లక్నోలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఎన్నికల ముందు సమన్లు జారీ చేస్తూ బిజెపి విభాగంలా వ్యవహరిస్తారంటూ సిబిఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను బిజెపి కొనుగోలు చేయవచ్చునని, ప్రజలను కొనుగోలు చేయలేరని అన్నారు. ‘మా కుటుంబానికి సిబిఐను ఎదుర్కోవడం కొత్త కాదు, ములాయం సింగ్‌ యాదవ్‌ ఎన్నేళ్లు సిబిఐను ఎదుర్కొన్నారో గుర్తు చేసుకోండి. దళితులు, అల్పసంఖ్యాక వర్గాల వారి కోసం పోరాడటం కోసం ఇటువంటి హింసలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం’ అని చెప్పారు. దేశంలోని బడా పారిశ్రామికవేత్తలకు రూ.15 లక్షల కోట్లు మాఫీ చేసిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతు రుణాలను మాత్రం మాఫీ చేయలేకపోతోందని విమర్శించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో యుపిలోని మొత్తం 80 సీట్లనూ ఇండియా వేదిక గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

➡️