చర్చల సమయంలో కుదరిన ఒప్పందాలు అమలు చేయాలి

ఎపి ఆశా వర్కర్ల యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ :రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల నిరసన దీక్షల నేపథ్యంలో ప్రభుత్వం తరుఫున వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ హామీ ఇచ్చిన అంశాలపై జిఒలను వెంటనే విడుదల చేయాలని ఎపి ఆశా వర్కర్ల యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో మారోమారు ఉద్యమం తప్పదని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా యుటిఎఫ్‌ కార్యాలయంలో ఆదివారం ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నెల 7, 9 తేదీల్లో నాయకత్వంతో ఆశా వర్కర్ల సమస్యలపై జరిగిన చర్చల మినిట్స్‌ కాపీ అదే నెల 20న ఇచ్చారని అన్నారు. చర్చల సందర్భంగా అంగీకారం కుదిరిన అంశాల్లో కొన్నింటికి మినిట్స్‌ కాపీల్లో ప్రస్తావించలేదని తెలిపారు. ప్రభుత్వ, మెడికల్‌ సెలవులు అమలు చేయాలని, ఆశా కార్యకర్తలు మృతి చెందితే దహన సంస్కారాలకు ప్రభుత్వం తక్షణ ఆర్థికసాయం కింద రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆశా వర్కర్ల న్యాయమైన కోర్కెలను ఆమోదిస్తూ మినిట్స్‌ కాపీని సవరించి తక్షణమే జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

➡️