వ్యవసాయ సంక్షోభంతో అందరికీ నష్టం

  • పోరాడి ప్రభుత్వాల మెడలు వంచాలి
  • ఎఐకెఎస్‌ అఖిలభారత ఉపాధ్యక్షులు టి సాగర్‌

ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి : వ్యవసాయ సంక్షోభంతో అందరికీ నష్టం వాటిల్లుతుందని ఎఐకెఎస్‌ అఖిల భారత ఉపాధ్యక్షులు టి సాగర్‌ తెలిపారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు కర్నూలులో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ‘వ్యవసాయ రంగ సంక్షోభం- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి’ అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు కర్నూలు ఎంపిపి హాల్లో రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సాగర్‌ మాట్లాడుతూ వ్యవసాయంపై ఆధారపడిన రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు సంక్షోభంలో ఉన్నారని, వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని వ్యాపారం చేస్తున్న వాళ్లు లాభాల్లో ఉన్నారని తెలిపారు. దేశంలో ఏటా పదివేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, అవి పాలకులు చేస్తున్న హత్యలగానే పరిగణించాలని అన్నారు. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని ఎన్నికల ముందు మోడీ చెప్పి అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదని విమర్శించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అమలైనా లాభం రాదని, మద్దతు ధరకు చట్టం తేవాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ద్వారా రుణాలు ఇవ్వాలని కోరారు. విద్యుత్‌ సవరణ బిల్లు బడా పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు మాత్రమే లాభమని, సామాన్య ప్రజలకు కాదని తెలిపారు. కార్మికులు, రైతులు ఒకే తాటిపైకి వచ్చి పోరాడి ప్రభుత్వాల మెడలు వంచాలని సూచించారు. సంయుక్త కిసాన్‌ మోర్చా రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వర రావు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల్లో ఒకటిన్నర కోట్ల మంది వ్యవసాయం నుంచి వేరే రంగాలకు వెళ్లిపోయారన్నారు. అవసరమైన నీటి వనరులు ఉన్నా వర్షం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందని, ఇప్పటికీ 60 శాతం పంటలు వర్షం పైనే ఆధారపడి ఉన్నాయని తెలిపారు. గత కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆక్సిలరేటర్‌ ఇరిగేషన్‌ బెనిఫిట్స్‌ ప్రోగ్రాంన్ని మోడీ ప్రభుత్వం పేరు మార్చి కేటాయింపులు తగ్గిస్తూ వచ్చిందన్నారు. కరువు నివారణకు, వ్యవసాయ ఉత్పత్తి పెరగడానికి, ఇరిగేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించాలని ఒత్తిడి చేసేలా ఎఐకెఎస్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో తీర్మానం చేయాలన్నారు. ఎకరాకు కనీసం రూ.పది వేలు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని భూపేంద్ర సింగ్‌ కమిటీ సిఫార్సు చేసినా ప్రభుత్వం ఇవ్వడం లేదని వాపోయారు. ఇండియా కూటమితో చర్చించి కామన్‌ మినిమం ప్రోగ్రాం లాగా ఒక ప్రణాళికను అమలు చేయగలిగితే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి కె ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ రైతాంగాన్ని కష్టాల నుంచి బయటపడేసేందుకు హామీలు అమలు చేయాలని ప్రభుత్వాలను ప్రశ్నించడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సమావేశంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామిరెడ్డి, ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రామచంద్రయ్య, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎ రాజశేఖర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల ఆహ్వాన సంఘం నాయకులు ప్రసాద్‌ శర్మ పాల్గొన్నారు.

➡️