పేదల న్యాయవాది ‘పులి’ బలరామయ్య ఇకలేరు..!

  • నేడు అంత్యక్రియలు
  • సిపిఎం రాష్ట్ర కమిటీ సంతాపం

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : పేద ప్రజలకు న్యాయపరంగా ఏ కష్టమొచ్చినా తానున్నానంటూ కనిపించే వ్యక్తి పులి బలరామయ్య(86) గత కొంత కాలంగా అనార్యోంతో బాధపడుతూ శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. కమ్యూనిస్టుగా నిబద్దత, నిజాయితీ కలిగిన న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. బాలరామయ్య 1938లో జన్మించారు. బిఎ, బిఎల్‌ పూర్తి చేసి న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. ఆయనకు భార్య (శారద), ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు సంజరు న్యాయవాద వృత్తిలో ఉన్నారు. గతంలో సర్వేపల్లిలో సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థిగా పులి బలరామయ్య పోటీ చేశారు. ఆయన భౌతికకాయాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, ఎం మోహనరావు, కె అజరుకుమార్‌, నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, సీనియర్‌ నాయకులు చండ్ర రాజగోపాల్‌, సిఐటియు నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు సందర్శించి నివాళి అర్పించారు. శనివారం ఉదయం బోడిగాడి తోటలో అంతక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
పులి బలరామయ్య మృతి తీరని లోటు : సిపిఎం
బలరామయ్య మృతి పార్టీకి తీరని లోటని సిపిఎం రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ న్యాయవాదిగా పేద ప్రజల పక్షాల నిలబడి అనేక కేసులు వాదించడంతో పాటు, సిపిఎం పోరాటాల్లో అగ్రభాగాన నిలిచారన్నారు. బలరామయ్య కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

➡️