ఇస్రో సౌర మిషన్‌ సక్సెస్‌!

Jan 6,2024 22:02 #Aditya-L1, #issro

లాగ్రాంజ్‌ పాయింట్‌కు ఆదిత్య ఎల్‌-1ప్రధాని, రాష్ట్రపతి సహా పలువురు అభినందనలు

బెంగళూరు : సూర్యునిపై అధ్యయనం చేసేందుకు ఇస్రో పంపించిన ఆదిత్య ఎల్‌-1 అంతరిక్ష నౌక ఎట్టకేలకు లాగ్రాంజ్‌ పాయింట్‌ (ఎల్‌ 1) సమీపాన గల హలో కక్ష్యలోకి శనివారం విజయవంతంగా చేరుకుంది. గతేడాది సెప్టెంబరు 2న శ్రీహరికోట నుంచి ఇస్రో దీన్ని ప్రయోగించగా, 127 రోజుల్లో దాదాపు 15లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఆదిత్య శనివారం తన నిర్దేశిత స్థానాన్ని చేరుకుంది. భూమి నుంచి ఎల్‌-1 మధ్య దూరం, భూమిాసూర్యుని మధ్య దూరంలో దాదాపు ఒక శాతం వుంటుంది. ఆదిత్య గమ్య స్థానం చేరుకోవడానికి ముందుగా ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు చేపట్టిన ఫైరింగ్‌ విన్యాసం విజయవంతమై అనుకున్నట్లుగా కక్ష్యలోకి ఆదిత్య చేరుకుంది. శనివారం సాయంత్రం 4గంటలకు ఈ ప్రక్రియ పూర్తయినట్లు ఇస్రో ప్రకటించింది. సౌర వాతావరణాన్ని లోతుగా, కూలంకుషంగా అధ్యయనం చేయడం ‘ఆదిత్య ఎల్‌-1 లక్ష్యంగా వుంది. సూర్యుడిపై పరిశోధనలు జరిపేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్‌ ఇదే. ఈ అంతరిక్ష నౌక మొత్తంగా ఏడు పేలోడ్లను తీసుకెళ్లింది. ఎలక్ట్రోమాగటిక్‌, పార్టికల్‌ డిటెక్టర్లను ఉపయోగించి సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్‌ తదితర విషయాలపై అధ్యయనం జరపనున్నారు. ఎల్‌-1 పాయింట్‌ నుండి ఆదిత్య ఉపగ్రహం ఎలాంటి అడ్డంకులు, ఆటంకాలు లేకుండా సూర్యుడిని నిరంతరంగా వీక్షిస్తూ పరిశోధనలు జరుపుతుంది. ఐదేళ్లపాటు పనిచేసేలా ఈ మిషన్‌ను రూపొందించారు. రాష్ట్రపతి, ప్రధాని ప్రభృతుల అభినందనలుఆదిత్య ఎల్‌-1 ప్రయోగం విజయవంతం కావడానికి కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను రాష్ట్రపతి, ప్రధాని ప్రభృతులు అభినందించారు. ఇస్రో మరో ఘన విజయాన్ని అందుకుంది. ఈ ఘనత సాధించిన శాస్త్రవేత్తలకు అభినందనలు. ఈ మిషన్‌తో మానవాళికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన అభినందన సందేశంలో పేర్కొన్నారు. భారత్‌ మరో అరుదైన ఘనత సాధించిందని ప్రధాని మోడీ ఎక్స్‌లో వెల్లడించారు. ”అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష యాత్రల్లో మన శాస్త్రవేత్తల అంకితభావానికి ఇది నిదర్శనమన్నారు. ఈ అద్భుత విజయం సాధించిన శాస్త్రవేత్తలకు అభినందనలు. మానవాళి ప్రయోజనాల కోసం శాస్త్ర సాంకేతిక రంగంలో సరికొత్త శిఖరాలకు చేరుకునే మన ప్రయాణం కొనసాగుతుంది” అని మోదీ ఎక్స్‌లో పెట్టిన పోస్టులో పేర్కొన్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి జితేంద్రసింగ్‌ మాట్లాడుతూ, ”మూన్‌ వాక్‌ నుంచి సన్‌ డ్యాన్స్‌ వరకు..! ఆదిత్య-ఎల్‌1 తుది కక్ష్యలోకి చేరుకుంది. ఇస్రోకు అభినందనలు” అని ప్రశంసించారు.

➡️