Surya Kiran : నటుడు, దర్శకుడు సూర్యకిరణ్‌ కన్నుమూత

Mar 11,2024 15:27 #died, #Director, #movie, #surya kiran

చెన్నై : ప్రముఖ దర్శకుడు, నటుడు సూర్యకిరణ్‌ కన్నుమూశారు. ఆయన గతకొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. సోమవారం తుదిశ్వాస విడిచారు. సూర్యకిరణ్‌ తెలుగులో సుమంత్‌ హీరోగా నటించిన ‘సత్యం’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా అటు సుమంత్‌కి, సూర్యకిరణ్‌కి కూడా మంచి పేరు సంపాదించిపెట్టింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లోనే ‘ధన 51’ చిత్రం తెరకెక్కింది. అయితే ఈ చిత్రం అనుకున్నస్థాయిలో హిట్‌కొట్టలేకపోయింది. ఇక ఈ చిత్రాల తర్వాత ‘రాజుభారు’, ‘చాప్టర్‌ -6’ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.

మాస్టర్‌ సురేష్‌ పేరుతో బాలనటుడిగా తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం చిత్రాల్లో దాదాపు 200కు పైగా చిత్రాల్లో సూర్యకిరణ్‌ నటించారు. బాలనటుడిగా రెండు కేంద్ర ప్రభుత్వ అవార్డులు, దర్శకుడిగా రెండు నంది అవార్డులు అందుకున్నారు. బిగ్‌బాస్‌ సీజన్‌ -4లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. సోదరి సుజాత కొన్ని సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె పలు సీరియల్స్‌లో నటిస్తున్నారు. హీరోయిన్‌ కల్యాణిని సూర్యకిరణ్‌ ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే కొన్నేళ్ల క్రితం వీరిద్దరూ వ్యక్తిగత కారణాలతో విడిపోయారు.

➡️