తహశీల్దార్‌ హత్య కేసులో నిందితుడు అరెస్ట్‌

  •  కన్వియన్స్‌ డీడ్‌ జాప్యమే ఘటనకు కారణం
  •  విశాఖ పోలీసు కమిషనర్‌ రవిశంకర్‌

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : తహశీల్దార్‌ రమణయ్య హత్య కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేశామని విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ ఎ.రవిశంకర్‌ తెలిపారు. సిటీ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఆయన సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు. శుక్రవారం రాత్రి కొమ్మాది సమీపంలో తహశీల్దార్‌ హత్యకు గురయ్యారని, ఆ కేసులో నిందితుడైన మురారి సుబ్రహ్మణ్యం గంగారావును సోమవారం ఉదయం తమిళనాడులో అరెస్టు చేశామని, విశాఖకు తీసుకొచ్చి విచారిస్తున్నామని తెలిపారు. నిందితుడు పారిపోయిన విధానాన్ని వివరిస్తూ హత్య జరిగిన రోజు రాత్రి విశాఖలోనే ఉండి శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఎయిర్‌ ఇండియాకు చెందిన విమానంలో విశాఖ నుండి బయలుదేరి బెంగళూరు చేరుకున్నారన్నారు. అక్కడి నుండి అదే విమానంలో చెన్నై వెళ్లాల్సి ఉండగా పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో బెంగళూరులో దిగిపోయాడని చెప్పారు. అక్కడ నుంచి బస్సులో తమిళనాడులోని చెంగల్పట్టు వరకూ వెళ్లాడని తెలిపారు. అక్కడ లోకల్‌ ట్రైన్‌లో చెన్నై వెళ్తుండగా సాంకేతికతతో విశాఖ నుంచి వెళ్లిన ప్రత్యేక బృందం అక్కడి పోలీసుల సహకారంతో అరెస్టు చేసిందని వివరించారు. సబ్‌ రిజిస్ట్రర్‌ కార్యాలయంలో కన్వియన్స్‌ డీడ్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ విషయంలో కొన్ని నెలలుగా తహశీల్దార్‌ రమణయ్య జాప్యం చేస్తున్నారని, దీనిపై విసుగు చెందిన నిందితుడు ఆయనను వెంబడించి హతమార్చాడని సిపి తెలిపారు. నిందితునిపై గతంలో హైదరాబాద్‌, విజయవాడల్లో రెండు చీటింగ్‌ కేసులు ఉన్నాయన్నారు. విజయవాడకు చెందిన ఆయన విశాఖలోని ఒక రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్నాడని తెలిపారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని, డిసిపి-1 మణికంఠ చందోల్‌ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోందని చెప్పారు.

➡️