సిబిఐ అధికార దుర్వినియోగం

Feb 19,2024 21:09 #Business, #CBI, #Chanda Kochhar
  • కొచ్చర్‌ దంపతుల అరెస్ట్‌పై బాంబే హైకోర్టు

ముంబయి : ఐసిఐసిఐ బ్యాంక్‌ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌లను సిబిఐ అరెస్ట్‌ చేసిన తీరును బాంబే హైకోర్టు తప్పుబట్టింది. 2022 డిసెంబర్‌లో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సిబిఐ) వారిద్దరినీ అరెస్టు చేయడం అధికార దుర్వినియోగంగా అభివర్ణించింది. ఇది బుద్దిలేని చర్యగా పేర్కొంది. కొచ్చర్‌ దంపతుల అరెస్టు చట్ట విరుద్ధమని జస్టిస్‌ అనుజా ప్రభుదేశారు, జస్టిస్‌ ఎన్‌ఆర్‌ బోర్కర్‌ డివిజన్‌ బెంచ్‌ 2024 ఫిబ్రవరి 6న పేర్కొంది. జనవరి 2023లో మరొక బెంచ్‌ వారికి బెయిల్‌ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సోమవారం అందుబాటులోకి వచ్చిన ఈ ఉత్తర్వుల ప్రకారం.. అరెస్టు నిర్ణయం తీసుకున్న దాని ఆధారంగా సిబిఐ పరిస్థితులు లేదా ఆధారాల ఉనికిని చూపించ లేకపోయాయని కోర్టు తెలిపింది. చట్టం పట్ల సరైన గౌరవం లేకుండా, చర్చ లేకుండా ఇటువంటి సాధారణ అరెస్టులు అధికార దుర్వినియోగమని న్యాయమూర్తులు అన్నారు. కొచ్చర్‌ దర్యాప్తులో సహకరించనందున అరెస్టులు చేయాల్సి వచ్చిందని సిబిఐ చేసిన విజ్ఞప్తిని అంగీకరించడానికి కోర్టు నిరాకరించింది. విచారణ సమయంలో మౌనంగా ఉండే హక్కు నిందితులకు ఉందని అన్నారు. వీడియోకాన్‌-ఐసిఐసిఐ బ్యాంక్‌ మోసం కేసులో 2022 డిసెంబర్‌ 23న కొచ్చర్‌ దంపతులను సిబిఐ అరెస్ట్‌ చేసింది. అరెస్టును సవాలు చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు. 2023 జనవరి 9న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ కొచ్చర్‌ దంపతులకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కాగా.. 2009-2018 కాలంలో ఐసిఐసిఐ బ్యాంక్‌ ఎండిగా ఉన్న చందా కొచ్చర్‌ తన అధికారాన్ని ఉపయోగించి నిబంధనలకు విరుద్దంగా వీడియోకాన్‌ అధిపతి వేణుగోపాల్‌ దూత్‌కు రూ.3,250 కోట్ల రుణాలు ఇచ్చారాని ప్రధాన అరోపణ. దూత్‌కు అప్పు ఇప్పించినందుకు గాను భర్త దీపక్‌ కొచ్చర్‌కు చెందిన నుపూర్‌ రెన్యూవెబుల్‌ లిమిటెడ్‌లో దూత్‌ పెట్టుబడులు పెట్టారు. ఇది బయటికి రావడంతో సిబిఐ రంగంలోకి దిగి కొచ్చర్‌ దంపతులను అరెస్ట్‌ చేశారు. ఆ వెంటనే చందా కొచ్చర్‌ ఉద్యోగం ఊడటం, బ్యాంక్‌ షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. క్విడ్‌ప్రోకోకు పాల్పడిన వారికి శిక్ష పడకపోగా.. తాజా కోర్టు ఉత్తర్వులు విమర్శలకు దారి తీస్తుంది.

➡️