తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు

Nov 20,2023 11:30 #Congress, #Telangana

ప్రజాశక్తి –  హైదరాబాద్‌ బ్యూరో :    ఈ  పదేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణను ముఖ్యమంత్రి కెసిఆర్‌ పూర్తిగా దోచుకుంటున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకగాంధీ ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన లక్ష్యం.. ప్రజల ఆకాంక్షలు నెరవేరడంలేదని దుయ్యబట్టారు. పెద్ద కంపెనీలతో దోస్తానీ చేస్తూ దేశాన్ని బిజెపి నాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో కెసిఆర్‌ ప్రజల రక్తం తాగుతున్నారని ఘాటుగా విమర్శించారు. ఒక్కసారి కాంగ్రెస్‌ పార్టీకి అధికారం అప్పగించాలని.. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌ నియోజకవర్గాల్లో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభల్లో ప్రియాంక గాంధీ పాల్గని మాట్లాడారు. ఖానాపూర్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులు వెడ్మ బజ్జు, శ్రీహరిరావు, శ్యాంనాయక్‌, రావి శ్రీనివాస్‌లను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇందిరాగాంధీ చేసిన మంచి పనులే ఇప్పటికీ ప్రజల మదిలో ఉండేలా చేశాయని గుర్తుచేశారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను కాంగ్రెస్‌ పార్టీ అంతే బాధ్యతతో నిర్వర్తించిందన్నారు. ఆదివాసీ, గిరిజను సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులు చూసి ఆనాడు కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చిందని.. కానీ ఏ ఉద్దేశంతో ఇచ్చిందో ఆ లక్ష్యం నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో నిరుద్యోగుల సమస్యలు తీరలేదని.. కేవలం కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడిందని విమర్శించారు.

ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చి కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై మాట్లాడలేదని.. బిజెపి, బిఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక్కటేనని ఆరోపించారు. కెసిఆర్‌ ప్రభుత్వంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయని, ధరణి పోర్టల్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. తెలంగాణలో రైతులు, కూలీలు, కార్మికులు అందరికీ అన్యాయం జరిగిందని వివరించారు. రైతుల కోసం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు కెసిఆర్‌ మద్దతు తెలిపారని గుర్తుచేశారు. బిజెపి, బిఆర్‌ఎస్‌ ఒక్కటేననే విషయం ప్రజలు గ్రహించాలన్నారు.

అధికారంలోకి రాగానే రుణమాఫీ
కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రైతులకు రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని, రూ.10లక్షల ఇన్సురెన్సుతో యువవికాసం పథకాన్ని తీసుకొస్తామన్నారు. ప్రతి జిల్లాలో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ నిర్మాణం చేపడతామని, కర్ణాటక తరహాలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, అభయహస్తం కింద రూ.12లక్షలు చెల్లిస్తామని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, మహారాష్ట్ర మాజీ సిఎం అశోక్‌చవాన్‌, ఎఐసిసి కార్యదర్శి రోహిత్‌చౌదరి, కర్ణాటక ఎమ్మెల్సీ ప్రకాష్‌రాథోడ్‌, రాజురా ఎమ్మెల్యే సుభాష్‌దోబే, ఆసిఫాబాద్‌ జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాద్‌రావు పాల్గొన్నారు.

➡️