ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల స్టిక్కర్ విడుదల

aiks council meeting stricker release

కార్మిక, కర్షక ఐక్యతను చాటుతాం
15న జరిగే బహిరంగ సభను జయప్రదం చేస్తాం.

ప్రజాశక్తి కర్నూలు కార్పొరేషన్ : కార్మిక కర్షక ఐక్యతను చాటే విధంగా కర్నూలు జిల్లాలో జరిగే ఏఐకేఎస్ అఖిల భారత కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేద్దామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర రెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి జె. నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. డిసెంబర్ 15,16,17 తేదీలలో కర్నూలులో జరగబోయే అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాల జయప్రదం కోరుతూ రూపొందించిన పోస్టర్ స్టిక్కర్ ను కొత్త బస్టాండ్ సమీపంలోని కార్మిక, కర్షక భవన్ లో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ, సిఐటియు జిల్లా కార్యదర్శి జె. నాగేశ్వరరావు, డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. నాగేష్, ఏపీ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాధాకృష్ణ, ప్రభాకర్, ఆటో వర్కర్స్ యూనియన్ ఓల్డ్ సిటీ కార్యదర్శి మైమూద్, న్యూ సిటీ అధ్యక్షులు హుస్సేన్ వలి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న పంటలకు మద్దతు ధరల చట్టం, సమగ్ర పంటల బీమా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యుత్తు సంస్కరణల ద్వారా రైతాంగంపై వేసే భారాలపై కర్నూల్లో నిర్వహించబోయే అఖిలభారత సమావేశాల్లో చర్చలు చేయ బోతున్నారన్నారు.

గడిచిన 9 సంవత్సరాల బిజెపి పాలన కాలంలో దేశవ్యాప్తంగా రైతులు అప్పుల పాలవుతున్నారని, సగటున ప్రతి రైతు కుటుంబానికి 2.54 లక్షల రుణభారం రైతు కుటుంబాలను వెంటాడుతోందన్నారు. రైతులకు సంబంధించిన అన్ని రకాల రుణాలు మాఫీ చేసి, తద్వారా రైతుకు ధైర్యంగా మేము వ్యవసాయం చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే ధైర్యాన్ని ఇచ్చేలాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలని ఏఐకేయస్ డిమాండ్ చేస్తుందన్నారు. 15న జరిగే బహిరంగ సభలో రైతులకు తోడుగా కార్మికులు ఇతర శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.

రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ మాట్లాడుతూ ఏఐకేఎస్ జాతీయ సమావేశాల జయప్రదం కోరుతూ ఇప్పటికే గోడ రాతలు, ఒక రకం పోస్టర్, రాష్ట్రస్థాయి సదస్సును నిర్వహించామని అందులో భాగంగానే ఈరోజు పోస్టర్ స్టిక్కర్ను విడుదల చేశామన్నారు. జిల్లాలో కరువు తీవ్రత అధికంగా ఉందని, కరువు బారిన పడ్డ రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. నష్టాన్ని లెక్కించడం 2 హెక్టార్లకు మాత్రమే పరిమితం చేశారని దాన్ని 4 హెక్టార్ల వరకు లిమిట్ ను పెంచాలన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి జే నాగేశ్వరరావు మాట్లాడుతూ కరువు తీవ్రతతో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. వీటికి పరిష్కారం వెతికేందుకు కర్నూల్లో అఖిలభారత సమావేశాలు ఏఐకేఎస్ నిర్వహిస్తోందని, దానికి సిఐటియుగా సంపూర్ణ సంఘీభావాన్ని తెలియజేస్తున్నామన్నారు. ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ సమావేశాలకు సంపూర్ణ మద్దతును తెలియజేయడంతో పాటు 15న జరిగే బహిరంగ సభలో అన్నదాతలకు అండగా ఆటో కార్మికులంతా పాల్గొంటున్నామని తెలియజేశారు.

➡️