పెండింగ్ ఉపాధి హామీ వేతనాలు చెల్లించాలి

Jan 26,2024 17:07 #Kurnool
aiawu protest for pending bills

ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : పెండింగ్ లో ఉన్న 13 వారాల ఉపాధి హామీ వేతనాలు చెల్లించాలని, కరువు వల్ల రావలసిన వంద రోజులు అదనపు పని దినాలు ఇవ్వాలని రోడ్డుపై బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు.మండలం పరిధిలో పాండవగల్ గ్రామ ఉపాధి కూలీలు గనేకల్లు బస్టాండ్ దగ్గర ఆదోని-మాధవరం రోడ్డుపై రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.ఈ కార్యక్రమానికి సిఐటియు మండల నాయకులు కే.పాండురంగ అధ్యక్షత వహించారు.సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే.లింగన్న మాట్లాడుతూ గత సంవత్సరం నవంబర్ 12 నుండి నేటి వరకు ఒక్క రూపాయి ఉపాధి హామీ వేతనం కూడా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చెల్లించలేదని,13 వారాల వేతనాలు తక్షణమే చెల్లించాలని కోరుతూ కూలీలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ సంవత్సరం తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల వలన ఇక్కడ చేయడానికి పనులు దొరకక నవంబర్ నుండే తెలంగాణ, గుంటూరు బెంగళూరు, వంటి ప్రాంతాలకు వేలాదిమంది కూలీలు వలస వెళ్లారని, కానీ ఇక్కడే ఉండి పనిచేసిన కూలీలకు మాత్రం ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోవడం ఆన్యాయం అని ఆయన విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం ఆదోని మండలాన్ని కరువు మండలం గా ప్రకటించినప్పటికీ ఉపాధి కూలీలకు రావలసిన 50 రోజుల ఆదనపు పని దినాలు, నేటికీ మంజూరు కాలేదని దీనివల్ల చాలామంది చేయడానికి పనులు లేక ఇండ్ల దగ్గరే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 5 కోట్లకు పైగా జాబ్ కార్డులను ప్రభుత్వం తొలగించిందని, వాటిని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని లేనిపక్షంలో మండల కార్యాలయాల్ని దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు యు హనుమంత రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆంజనేయ, ఉసేని, లక్ష్మీనారాయణ, మునెమ్మ,ఉపాధిహామీ మేటీలు శివరాములు,ఆనంద్, పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

➡️