తెలంగాణలో గొర్రెల పంపిణీలో అక్రమాలపై ఏసీబీ కేసు

Jan 23,2024 14:46 #acb, #Telangana

హైదరాబాద్‌ : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) హయాంలో తెలంగాణలో ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. ఈ పథకంలో అక్రమాలు జరిగాయని గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ లో నమోదైన కేసును టేకోవర్‌ చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా సోమవారం కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌ మీడియాకు వెల్లడించారు. కేసు దర్యాఫ్తును మొదలు పెట్టామని, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను విచారిస్తామని వివరించారు. గొర్రెల పంపిణీలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులలో ముందుగా ఎఫ్‌ఐఆర్‌ లో పేర్కొన్న వారిని విచారిస్తారని అధికార వర్గాల సమాచారం. రెండు మూడు రోజుల్లో విచారణ మొదలవుతుందని తెలుస్తోంది. ఎఫ్‌ఐఆర్‌ లో పశుసంవర్థక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్లు రవికుమార్‌, కేశవసాయిల పేర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరితో పాటు కొండాపూర్‌ కు చెందిన ‘లోలోనా ది లైవ్‌’ కంపెనీ కాంట్రాక్టర్‌ సయ్యద్‌ మొయిద్‌ కు ఈ స్కాంలో పాత్ర ఉందని తెలుస్తోంది.

➡️