800మందికి పైగా పశ్చిమదేశాల ఉద్యోగుల లేఖ

Feb 4,2024 09:45 #800, #letter, #Western workers

వాషింగ్టన్‌ : ఇజ్రాయిల్‌ అనుకూల విధానాన్ని అనుసరిస్తున్నందుకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అమెరికా, బ్రిటన్‌, ఇయు దేశాల్లోని 800మందికి పైగా సివిల్‌ సర్వెంట్లు ఒక లేఖ విడుదల చేశారు. గాజాపై మారణకాండ సాగిస్తున్న ఇజ్రాయిల్‌ విషయంలో తమ ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించడంపై వారు తీవ్రంగా విమర్శించారు. న్యూయార్క్‌ టైమ్స్‌ ఈ లేఖను ప్రచురించింది. గాజాలో ఇజ్రాయిల్‌ వ్యవహరిస్తున్న తీరును చూసీ చూడనట్లుగా పోతున్న పశ్చిమ దేశాల ప్రభుత్వాలు అంతర్జాతీయ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘిస్తున్నాయని, యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాయని, జాతి ప్రక్షాళనకు, మారణకాండకు అనుమతిస్తున్నాయని ఆ లేఖ విమర్శించింది. గాజాపై సాగిస్తున్న యుద్ధంలో ఇజ్రాయిల్‌ ఎలాంటి హద్దులను పాటించడం లేదని, ఫలితంగా వందలు, వేల సంఖ్యలో సామాన్యులు మరణిస్తున్నారని పేర్కొంది. ఉద్దేశ్యపూర్వకంగానే సాయం అందకుండా చేస్తున్నారని, దీంతో వేలాదిమంది ఆకలి బాధతో అల్లాడుతూ, మృత్యు ముంగిటకు చేరుతున్నారని ఆ లేఖ విమర్శించింది. అమెరికా నేతృత్వంలోని కూటమి దేశాల్లో ప్రజా రంగంలో వున్న ఉద్యోగులు ఇటువంటి అసమ్మతి ప్రకటన జారీ చేయడం ఇదే మొదటిసారని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. వీరిలో ప్రధానంగా విదేశీ మంత్రిత్వ శాఖలకు చెందినవారు ఎక్కువగా వున్నారు. కాల్పుల విరమణకు పిలుపునిస్తూ, ఇంతకుముందు అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధి ఇల్హాన్‌ ఒమర్‌, జర్మనీ ఎంపి సెవియం డాగ్డెలాన్‌లు తీసుకువచ్చిన పిటిషన్‌పై పలు దేశాలకు చెందిన వందలాదిమంది సంతకాలు చేశారు.

➡️