పుస్తకాల హోటల్‌ ..!

Apr 14,2024 09:32 #Jeevana Stories

పిల్లల చేత సెల్‌ఫోను మరిపించి, పుస్తకాలు చదివిస్తూ, బువ్వ తినిపించేది ఎవరు? అనడిగితే ఠకీమని ”ఇంకెవరు.. అమ్మ” అని చెబుతాం కదా. కానీ, ఇక్కడ ఆ పని చేస్తోంది ఒక హోటల్‌. మనం ఆ హోటల్‌కు వెళ్లి ఆర్డర్‌ ఇచ్చి ”ఫుడ్‌ వచ్చేవరకు ఫోన్‌ చూసుకుంటాం” అంటే కుదరదు. ”ఇదేం రూలండీ. ఫోన్‌ తియ్యకుండా ఎలా టైంపాస్‌ చెయ్యడం?” అనుకోకండి. అక్కడ మనతో మాట్లాడేందుకు వేలకొలదీ పుస్తకాలుంటాయి. అవి నవ్వుతూ మనల్ని పలకరిస్తాయి. ఇదంతా వినడానికే కాదు; అక్కడ తినడానికి, చదవడానికి కూడా చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో ఆ హోటల్‌కు వెళ్తే, ఇంటిల్లిపాదికీ పనికొచ్చే పుస్తకాలు అక్కడ అందుబాట్లో ఉంటాయి. ఎవరికి నచ్చింది వారు చక్కా చదూకోవొచ్చు!
ఈ హోటల్‌ పెట్టింది ఎవరు? అంటే మళ్లీ ‘అమ్మే’ అని సమాధానం. అవును… చద్దన్నం లాంటి స్వచ్ఛమైన మనసున్న ఓ 74 నాలుగేళ్ల పెద్దమ్మ మదిలోని ఆలోచనే ఈ హోటల్‌. ఆమె పేరు భీమాబాయి జోంధాలే. మహారాష్ట్రలోని నాసిక్‌లో ‘బుక్‌ హోటల్‌’ పేరుతో దీనిని నడుపుతోంది.
భీమాబాయికి చిన్నప్పుడు చదువంటే చాలా ఇష్టం. పుస్తకాలంటే ప్రాణం. పేదరికం ఆమెను పుస్తకాల నుంచి పన్నెండేళ్లకే దూరం చేసింది. ఆరో తరగతిలో ఉంగానే ఇంట్లో వాళ్లు ఆమెకు పెళ్లి చేసి, అత్తింటికి పంపేశారు. భర్త తాగుబోతు. బాధ్యత లేని మనిషి. ఇంట్లోకి ఏమీ తెచ్చిపెట్టేవాడు కాదు. దీంతో, చాలా చిన్నప్పుడే బండెడు సంసారాన్ని ఈదాల్సిన బాధ్యత ఆమెపై పడింది. ఈ బతుకు పోరాటంలో ఆమె చదువు ఆశ నెరవేరకుండా పోయింది!
భర్త బలాదూరుగా తిరిగేవాడు. ఇరవై ఏళ్ల వయసైనా దాటకుండానే ఆమెకు ఇద్దరు పిల్లలు. వారిని పెంచుకుంటూ వ్యవసాయం చేసేది. తాగుబోతు భర్తతో వేగలేక అల్లాడిపోయింది. ఇంటిపనీ, బయటపనీ, పొలం పనులూ అన్నీ నెత్తిన పడ్డాయి. ఆమె పిల్లలూ ఆమెతో పాటే కష్టపడేవారు. ఎలాగోలా పొలం ఆధారంగా కుటుంబాన్ని నడుపుతున్న సమయంలో ఆ పొలాన్ని కూడా తాగుడు కోసం ఆమె భర్త అమ్మేశాడు. ఈ పరిస్థితి ఆమెను మరింతగా కుంగదీసింది. తన బిడ్డల కోసం కంచంలో ఇంత బువ్వ పెట్టడానికి వేరే వాళ్ల పాలాల్లో గంటల తరబడి కష్టపడేది.
తల్లి కష్టాన్ని అర్థం చేసుకున్న పిల్లలు ఇద్దరూ ఆమె వెన్నంటే ఉన్నారు. బాధ్యతలను, బాధలను ఆనందంగా పంచుకున్నారు. తల్లిలాగే చదువుకోవాలనే తపన ప్రవీణ్‌కు బాగా ఉండేది. కానీ, కుటుంబం కోసం పని వెతుక్కోవల్సి వచ్చింది. ఒక దిన పత్రిక పంపిణీ పనిలో చేరాడు. తన చదువుకు తానే డబ్బు సమకూర్చుకున్నాడు. తర్వాత వారి కుటుంబం 2008లో నాసిక్‌ నగరానికి మారింది. పుస్తకాల పట్ల ఆసక్తితో ఉన్న ప్రవీణ్‌ పుస్తక ప్రచురణ సంస్థ మొదలు పెట్టాడు. తల్లి ఎంతో సంతోషించింది. అంతా బాగానే నడుస్తోంది అనుకున్నంతలో ప్రచురణ సంస్థను మూసివేయాల్సి వచ్చింది. అప్పటికే వారి వద్ద మరాఠీ భాషా పుస్తకాలు కొన్ని మిగిలిపోయాయి. భీమాబాయి కూతురి సహాయంతో ఒక చిన్న టీ స్టాల్‌ను ప్రారంభించింది. అక్కడ పుస్తకాలను ఉంచి, అక్కడికి వచ్చేవారిని టీ తయారయ్యేలోగా చదవమని ప్రోత్సహించేది. ఆ విధంగా అక్కడికి వచ్చే టీ ప్రియులకు పుస్తక పఠనం ఒక అలవాటుగా మారింది. వ్యవసాయం చేసుకోవాల్సిన వారు ఇలా రోడ్ల మీద టీ అమ్ముకోవటం ఏమిటని గ్రామస్తులు, బంధువులు సణుక్కున్నా ఆమె పట్టించుకోలేదు.
ఫోన్లు లేవు, పుస్తకాలు మాత్రమే!
2010లో భీమాబాయి తన ఇద్దరు బిడ్డలతో కలిసి, ఇప్పుడు నడుపుతున్న అజ్జిచ్య పుస్తకాంచ హౌటల్‌ను ప్రారంభించింది. టిఫెన్లు, భోజనాల తయారీ కూడా మొదలు పెట్టారు. హోటల్‌కి వచ్చేవారు అదే పనిగా ఫోన్‌ చూడడం, తోటి వారితో మాటలు లేకుండా గడపటం భీమాభాయికి నచ్చలేదు. దీంతో, ఈసారి ఎక్కువ చోటు కూడా ఉంది కాబట్టి, మరిన్ని పుస్తకాలు రప్పించారు. అన్ని వయసుల వారికి పనికొచ్చే పుస్తకాలు అక్కడ అమర్చారు. ”ఇక్కడ ఫోన్లు నిషేధం. చక్కగా పుస్తకాలు చదువుకొండి. తరువాత కడుపునిండా ఆరగించండి.” అని బోర్డు కూడా పెట్టించింది ఆమె. దీంతో, అది పుస్తకాల హోటల్‌గా అందరిలోనూ ప్రచారం జరిగింది. ఇప్పుడు అక్కడి వచ్చినవారెవరకూ పుస్తకాలు చదవకుండా ఉండరు. కొంతమందైతే పుస్తకాల కోసమే ఆ హోటల్‌కు వస్తుంటారు. వచ్చినవాళ్లు చదువుకుంటూ పుస్తకాల్లో నిమగమైపోతే, తన చిన్ననాటి ఆశను వారిలో చూసుకుంటూ మురిసిపోతుంది భీమాబాయి.
25 పుస్తకాలతో రోడ్డు పక్కన చిన్న టీస్టాల్‌గా ప్రారంభించారు. ఇప్పుడు 5000 పుస్తకాలున్న చక్కని లైబ్రరీ హోటల్‌గా విజయవంతంగా నడుపుతున్నారు. అక్కడి భాషలో ‘అజ్జిచ్య పుస్తకాంచ హౌటల్‌’ అని ఉంటుంది. చదవడానికి విలువైన పుస్తకాలతో పాటు, తినడానికి రుచికరమైన భోజనం అందిస్తూ హోటల్‌ను ఎంతో ఆహ్లాదంగా, విజ్ఞానదాయకంగా నడుపుతున్న ఆజీ అమ్మ ఉత్సాహం ముందు 74 ఏళ్ల వయసు కనిపించదు.
బీమాబాయి అమ్మ హోటల్‌కు వచ్చీపోయే అతిథులను చిరునవ్వుతో పలకరిస్తుంది. కష్టమర్ల ముఖాల్లోని టెన్షన్లు, హడావిడి జీవితాల్లోని గందరగోళాలన్నింటినీ మాయమై ప్రశాంత వాతావరణంలో మనసు ఉల్లాసం కలిగేలా ఎప్పుడూ హోటల్‌ వాతావరణాన్ని ఉంచుతుంది. హోటల్‌ అంతా కలియదిరుగుతూ కష్టమర్లను పలకరిస్తూ ఓ చక్కని పుస్తకాన్ని అందిస్తూ, కమ్మనైనా ఆహారాన్ని వడ్డిస్తూ ఆమె ఎప్పుడూ బిజీగా గడుపుతుంది.
”నా కస్టమర్లందరూ ఆ పుస్తకాలను ఎంతో ఆసక్తిగా చదువుతున్నప్పుడు, వారిలో చాలామంది ఇక్కడ ఉన్నారని కూడా మరిచిపోతారు. అంతగా లీనమై చదివే వారిని చూసి నా మనసు గర్వంతో ఉప్పొంగుతుంది” అని ఆమె నవ్వుతూ చెబుతోంది.

➡️