అబ్బాయిల పెంపకంలో మార్పు అవసరం

Mar 3,2024 11:25 #Sneha, #Women's Day

అబ్బాయిలు అలా చేస్తున్నారు.. ఇలా చేస్తున్నారు.. అని ఆక్షేపించే ముందు వారికి పెంపకంలోనే బీజాలు పడుతున్నాయనే వాస్తవాన్ని అంగీకరించాలి. కుటుంబంలోనే ఆడపిల్లలు, అబ్బాయిల విషయంలో వివక్ష నేటికీ కొనసాగుతోంది. అందుకే అబ్బాయిల పెంపకంలో మార్పు అవసరం. ఈ నేపథ్యంలో అందుకు కారణాలు, ఎలా సాధ్యమో ప్రముఖ మనస్తత్వ నిపుణులు డాక్టర్‌ పద్మజ గారి మాటల్లోనే.. 

సమాజం అనేక విధాల మారుతున్నా అమ్మాయిలు అబ్బాయిల పెంపకంలో మార్పులు ఇంకా పూర్తిగా రాలేదు. ఇప్పటికీ అబ్బాయిలు పుడితే మంచిది. అమ్మాయిలు పుడితే బాధపడాలి. అనే ఆలోచన అనేక కుటుంబాల్లో ఇంకా ఉంది. అంటే ఎంతోకాలంగా మగపిల్లలకుండే ప్రాధాన్యతని మనం చదువుకునే లిటరేచర్‌లోగానీ, సినిమాల్లోగానీ, ఒకరి నుంచి ఒకరు అందిపుచ్చుకునే ఆలోచనాపరంగా గానీ ఏదేమైనా అబ్బాయిలకు ప్రాధాన్యత ఇవ్వటం అనేది ఎంతోకాలంగా వస్తోంది. ఇప్పటికి మారిన సామాజిక దృక్పథంతోగానీ, వచ్చిన పెనుమార్పుల గురించిగానీ, రాబోయే మార్పుల గురించి గానీ మనం ఆలోచిస్తే ఈ ఆడ మగ తేడా అనేది.. ఆ సరిహద్దులేవైతే ఉన్నాయో.. ముఖ్యంగా పిల్లల పెంపకం విషయంలో కొంత వరకు పలుచబడిందేమో కానీ.. సంపూర్ణంగా మార్పు రావాల్సి ఉంది.

అద్భుతమైన పాత్ర స్త్రీది..

అబ్బాయిలే తల్లిదండ్రుల బాధ్యత వహిస్తారు. అమ్మాయిలైతే బాధ్యత వహించరు. ఆడపిల్ల కాబట్టి ఇంకొకరి ఇంటికి వెళ్తుంది. ఏ ఇంటికి వెళ్తుందో ఆ కుటుంబ బాధ్యత మాత్రమే వహిస్తుందని అనటం ఈనాటి మారిన జీవన నేపథ్యాలలో నిర్హేతుకం. అది సహేతుకం కాదు. అమ్మాయిలూ బాగా చదువుకుంటున్నారు. ఒకప్పుడు అమ్మాయిలకు బేసిగ్గా రాయటం వస్తే చాల్లే.. చదువుకోకపోయినా పర్వాలేదులే.. కుటుంబాన్ని చూసుకుంటే చాల్లే.. పిల్ల్లల్ని చూసుకుంటే చాల్లే.. ఇలాంటి భావజాలంతో పెంచిన తల్లిదండ్రులుండేవారు..! ఇవాల్టి సమాజంలో స్త్రీ ఒక రోల్‌ కాదు.. ఒక పాత్ర కాదు.. అనేక పాత్రల్ని ఒకేసారిగా.. సమాంతరంగా.. అద్భుతంగా పోషిస్తున్న పరిస్థితి. ప్రతి స్త్రీ కూడా ఈ ఆలోచన కరెక్ట్‌ కాదని నిరూపిస్తూనే ఉంది. ఇది ఇవాళ కాదు.. ఒక్కరోజులో కాదు.. గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నది. అయితే మారిన స్త్రీ పాత్రలో స్త్రీకి ఇంకా ఎక్కువ బర్డెన్‌, మరింత బాధ్యత యాడ్‌ అవుతుందా అంటే.. నిజమే యాడ్‌ అవుతుంది. కానీ మీరు ఎన్ని బాధ్యతలు నాకిచ్చినా నేను స్వీకరించగలను.. అని స్త్రీ నిరూపిస్తున్నది.

ఆమె క్వాలిటీ ఆఫ్‌ టైమ్‌ చూపుతోంది..

చదువుకుంటోంది.. ఉద్యోగం చేస్తోంది.. అలా అని ఆడవాళ్ళే పిల్లల్ని సరిగా పెంచుతారు.. మగవారు పెంచలేరు అనే అభిప్రాయం ఉంది కదా.. అక్కడా తల్లిగా తన బాధ్యతను సమర్ధవంతంగా పోషిస్తోంది. ఇదివరకు క్వాంటిటీ ఆఫ్‌ టైమ్‌ మాత్రమే చూసేవారేమో.. అంటే సమయం తాలూకూ పరిమాణం ఒక్కటే చూసేవారేమో గానీ ఇప్పుడు క్వాలిటీ ఆఫ్‌ టైమ్‌ చూపిస్తోంది. అంటే నాణ్యతగల సమయాన్ని చూపిస్తోంది. తన బిడ్డతో ఎంత సమయం గడుపుతుందో ఆ సమయం పూర్తిగా బిడ్డకే కేటాయిస్తోంది. కాబట్టి తల్లిగానూ బాధ్యత బాగా వహిస్తోంది.. తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని తనకు చేతనైనంతలో బాగా చూసుకుంటోంది.. అయితే భార్యాభర్తలిద్దరూ చేదోడు వాదోడుగా ఉంటున్నారో.. అక్కడ ఆమె తల్లిదండ్రులు.. అతని తల్లిదండ్రులు అనే తేడాలేమీ రావలసిన అవసరం లేదు. అన్ని బాధ్యతల్నీ తన భుజస్కందాలపై వేసుకుంటోంది. అయితే భారం మొత్తం తన మీదే వేయకుండా భర్త కూడా తోడు పంచుకోవాలి.

శ్రమలోనూ పాలు పంచుకోండి..

ఆమె శ్రమలో కచ్చితంగా పాలుపంచుకోవాలనే కనీస జ్ఞానంతోటి పిల్లల్ని పెంచాలి. చిన్నప్పటి నుంచి వారికి ఇది ఆడపని, అది మగపని అని కాకుండా ఇది మనపని, ఇంటిపని అని చెప్పి, చేయించాలి. మగపిల్లలే బజారులో సరుకులు తీసుకురావాలి, ఆడపిల్లలు ఇంట్లో పనిచేయాలని వేర్వేరుగా చెప్పకూడదు. ఇద్దరికీ తేడాల్లేని పనులు. ఇద్దరి చేతా తల్లిదండ్రులు చేయించగలిగినప్పుడు.. వాళ్ళకు నేర్పగలిగినప్పుడు.. అది అద్భుతమైన పెంపకానికి ఒక ఉదాహరణగా నిలబడుతుంది.

చేదోడు వాదోడుగా..

ఇంట్లో నలుగురున్నప్పుడు ఇంట్లో పనికి స్త్రీ మాత్రమే ఎందుకు పరిమితం కావాలి. ఇది ఈనాటి అమ్మాయిలు సహజంగానే ప్రశ్నిస్తున్నారు. అలాగే అబ్బాయిలు కూడా ఇంటికొచ్చిన తర్వాత హాయిగా కూర్చుని, టీవీలో సినిమానో, క్రికెట్‌నో చూసుకుంటూ ఉంటున్నారు. ఆఫీసు నుంచి ఆవిడొచ్చి మరో పాత్రలోకి ప్రవేశించి ఇంటిల్లిపాది ఆలనా పాలనా చూడాలంటే కష్టం. ఆమె కూడా ఒక మనిషే కదా! అలసిపోతుంది కదా..! అందుకని చిన్నప్పటి నుంచీ తల్లికి సహాయం చేసే విధంగా ఆడ, మగ తేడా లేకుండా ప్లిల్లల్ని పెంచాలి. ఆ పిల్లలు పెద్దయ్యాక వాళ్ళ అక్కచెల్లెళ్ళకుగానీ.. అన్నదమ్ములకు గానీ.. చేదోడు వాదోడుగా నిలబడటమే కాదు. కుటుంబంలో పెళ్ళి అయిన తర్వాత భార్యకు చేదోడు వాదోడుగా భర్త, భర్తకు చేదోడు వాదోడుగా భార్య.. ఇద్దరూ కలిసి వాళ్ళ పిల్లల పెంపకంలో మంచి రోల్‌మోడల్స్‌గా నిలుస్తారు.

తేడాలు చూపించొద్దు..

స్కూళ్ళలో కానీ, ఇంట్లో కానీ ఏదైనా చిన్న చిన్న అవసరాలు ఉన్నాయనుకోండి. ఉదాహరణకు వాళ్ళ టేబుల్‌ శుభ్రం చేసుకోవటం, రూమ్‌ క్లీన్‌ చేసుకోవటం, బట్టలు ఉతుక్కోవటం ఇలాంటప్పుడు.. అబ్బాయి కదా వాడేం చేస్తాడులే అని అమ్మాయిలకి అప్పగించడం.. అలా వద్దు. ఇలాంటి తేడాలు చూపించడం వల్ల వాళ్ళ మనసుల్లో అలాంటి ఆలోచనా ధోరణిని మనమే కల్పించిన వారమవుతాం. అలా కాకుండా ఏపనైనా ఎవరైనా చేయవచ్చు.. దానికి కావలసిన శక్తి సామర్థ్యాలు అందరిలోనూ ఉన్నాయి అనేది వారికి కలిగించాలి. ఒకవేళ శక్తి సామర్థ్యాలు లేకపోతే సాటివారి సహకారంతో కలిసి పనిచేయవచ్చనే అభిప్రాయం వస్తుంది. అలాంటప్పుడు టీమ్‌ బిల్డింగ్‌లోనూ అది ఉపయోగపడుతుంది. ఆడ పనులు, మగ పనులు అనే తేడాలు లేకుండా అందరూ కలిసి చేసుకునేందుకు తోడ్పడుతుంది. అలాగే అన్నిరకాల పనులూ అందరూ నేర్చుకుని, బాధ్యత వహించేలా వాళ్ళు ఆలోచించడానికీ ఇది సహాయపడుతుంది.

సహేతుకమైన, సైంటిఫిక్‌ ధోరణితో..

ఒక వయసొస్తే కౌమార్యంలోకి వస్తున్నప్పుడు.. పిల్లల్లో అనేక రకాల శారీరక, మానసిక, సామాజిక మార్పులనేవి వస్తాయి. అలాంటప్పుడు కొన్ని పరిధులు కూడా ఉంటాయి. వాళ్ళ ప్రవర్తనలో కానీ.. వాళ్ళ ఆలోచనలో కానీ.. వాళ్ళకు నేర్పాల్సిన పరిధులను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. కాకపోతే అవి వారిని బాధపెట్టేలా కాకుండా ఒక సైంటిఫిక్‌ ధోరణిలో.. సహేతుకమైన ధోరణిలో.. తల్లిదండ్రులు గానీ, టీచర్స్‌ గానీ వాళ్ళకు వివరిస్తే బాగుంటుంది. కొన్ని పాఠ్యాంశాల్లో చేర్చినా.. అన్నీ చేర్చలేరు కదా! ఇంకా మనం చుట్టూ ఉన్న సమాజంలో గానీ, వచ్చే మార్పులను బట్టి గానీ.. అలాగే గర్ల్‌ ఫ్రండ్‌, బారు ఫ్రండ్‌ లాంటి అంశాలన్నీ మాట్లాడుతూ ఉంటారు కదా! దానికి తగిన వయసేంటి.. భవిష్యత్తేంటి.. ఏ రకంగా దాన్ని అర్థం చేసుకోవాలి.. శరీరంలో సహజంగా వచ్చే మార్పులకి వాళ్ళెలా సంసిద్ధులు కావాలి.. వాటినెలా స్వీకరించాలి.. అనే వాటిని తెలపాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.

అలాగే కొన్ని సహజమైన మార్పులుంటాయి. వాటినెలా అంగీకరించాలి.. జీవితంలో ఒక భాగంగా వాటినెలా యాక్సెప్ట్‌ చేయాలి.. వాటిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు.. దేనికి ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదు.. దేనికి అతిగా ప్రాధాన్యత ఇవ్వకూడదు.. ఒకవేళ దేనికైనా విపరీతమైనా మార్పులు జరుగుతుంటే తనను తాను ఎలా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎవరు దానిని అర్థం చేసుకోడానికి తనకు సహకరిస్తారు.. స్నేహితుల సహాయం ఎలా ఉపయోగపడుతుంది. టీచర్ల పాత్ర ఏంటి.. తల్లిదండ్రుల పాత్ర ఏంటి.. ఇవన్నీ కూడా సమాజంలో ముఖ్యమైన వాళ్ళుగా మనమే ఆలోచించాలి.

విజ్ఞానంతో కూడిన ఇష్టం..

ఏ సినిమాలోనో స్కూలు వయసు కూడా దాటని పిల్లవాడు ఒక అమ్మాయి వెంటపడి, నువ్వు గనక నాకు దక్కకపోతే ఎవరికీ దక్కడానికి వీల్లేదు.. స్కూలైనా, కాలేజీలోనైనా ఇలా ఆలోచిస్తున్నాడూ అంటే ఒక అధికారపూరిత ధోరణి ఇది. సాటి వ్యక్తి స్త్రీ అయినా, పురుషుడైనా.. సాటి వ్యక్తికి గౌరవం ఇవ్వటం అంటే.. నిజంగా ప్రేమించటం అంటే.. వాళ్ళపై అంతర్లీనంగా గౌరవం కూడా ఉంటుంది కదా! ఆమె అభిప్రాయాలకు గౌరవం ఇచ్చినవాడు ఇలాంటి మాటలు మాట్లాడడు. అవతలి వ్యక్తి స్థానంలో నిలబడి ఆలోచించటంలేదని మనం అర్థం చేసుకోవాలి. అవతలి వ్యక్తి కూడా మనలాంటి మనిషేనని, తను నిజంగా ప్రేమించినట్లయితే వాళ్ళ అభిప్రాయాలకు విలువివ్వాలి. ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ అవతలి వ్యక్తిని అంతగా ఇష్టపడేటట్లయితే వాళ్ల అయిష్టతని, వ్యతిరేకతని, తిరస్కారాన్ని కూడా స్వీకరించేలా ఉండాలి. అదీ ప్రేమంటే. అంతేగానీ నువ్వు నాకు దక్కకుంటే నిన్నెవరికీ దక్కనివ్వను.. నీకు హాని చేస్తాను అనే ఆలోచనా ధోరణి పిల్లల్లో డెవలప్‌ అవుతోంది అంటే.. నీ అంతటి వాడు లేడు.. మగవాడిగా నీకా అధికారం ఉంది.. అర్హత ఉంది.. నీకు కావలసిన దాన్ని సాధించేందుకు అర్హత ఉంది అని నేర్పటమే అవుతుంది. అలా చెప్పటం కరెక్టు కాదు. ఏదైనా సాధించాలంటే తీవ్రమైన కృషి ఉండాలి. అదీ నిజాయితీ, ఆత్మవిశ్వాసంతో కూడిన పద్ధతి ప్రకారం జరగాలి. ఇది ఒక్క ప్రేమ విషయంలో మాత్రమే కాదండి. జీవితంలో ఏది సాధించాలన్నా నిజాయితీ ఉండాలి. ముఖ్యంగా మరో వ్యక్తికి సంబంధించిన విషయంలో మనమట్టుకే కాకుండా వారి ఆలోచనలు, అభిప్రాయాలు, అభిరుచులు ఇవన్నీ మనం గౌరవించి, స్వీకరించే పాటి విజ్ఞానం, ఇష్టం మన దగ్గర ఉండాలి.

పురోగాముల జీవితాలే సూచికలు..

సమాజం పురోగమనంలో ఉంది కానీ, తిరోగమనంలో కాదు. తిరోగమనానికి సంబంధించిన ఆలోచనలేవైతే ఉంటాయో.. అవి ఎవరి ద్వారా అయినా కానీయండి, అది సమాజం నుండి అయినా గానీ, మనం కాదనలేనటువంటిది. సోషల్‌ మీడియా, సినిమాల ప్రభావం వల్ల అటువంటి ఆలోచనలు వాళ్ళను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అలాకాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచి ఒక తార్కికమైన పద్ధతిలోను, నిజాయితీ.. విలువలతో కూడిన ఆలోచనలు చేసేట్లుగానూ, వాళ్ళంతట వాళ్ళుగా తమ ఆలోచనలను పెంపొందించుకునేలానూ తల్లిదండ్రులు, టీచర్లు, సమాజంలో ముఖ్యమైన వ్యక్తులు అందరూ కలసి కృషి చేయాలి. అప్పుడే పిల్లల్లో సహేతుకమైన ఆలోచనా ధోరణి పెరుగుతుంది. అలాగే విలువలతో కూడిన జీవితం ఎంత ముఖ్యమో.. దీర్ఘకాలంలో దానివల్ల ప్రయోజనాలేమిటో కూడా వారికి అర్థం కావాలి. తాత్కాలికంగా పొందే ఆనందం కానీ, లాభం కానీ కలకాలం నిలబడదు. పైగా దానివల్ల అనేక సమస్యలుంటాయనేది వాళ్ళకర్థమయ్యే విధంగా సోదాహరణంగా కొన్ని కొన్ని ఉదాహరణలతో.. అంటే జీవితంలో బాగా పైకొచ్చినవాళ్ళు ఎలాంటి ధోరణి ఉపయోగించారు. ఎలాంటి విలువలతో కూడిన జీవితాన్ని వారు జీవించారు.. ఏ రకంగా వాళ్ళు పైకొచ్చారు.. అనేవి సోదాహరణలతో చెబుతూ.. వాళ్లకు సదవగాహన కలిగించే ప్రయత్నం చేయాలి.

డాక్టర్‌ జి. పద్మజసెంటర్‌ ఫర్‌ హెల్త్‌ సైకాలజీ హెడ్‌,

యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌.

➡️