9న నులిపురుగుల నివారణ దినోత్సవం

Feb 8,2024 23:01

ప్రజాశక్తి – పంగులూరు
ఈనెల 9నుండి మండలంలో జరిగే జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంపీడీఒ కె మ్యాత్యూ బాబు కోరారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం జరిగిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నులి పురుగుల నివారణ కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 14సచివాలయాల్లో గల 21పంచాయతీల్లో నులిపురుగుల నివారణ కార్యక్రమం శుక్రవారం నుండి ప్రారంభించాలని అన్నారు. స్కూల్ విద్యార్థులు, అంగన్‌వాడి పిల్లలు అందరూ హాజరు కావాలని కోరారు. ఒకవేళ 9న స్కూలుకు హాజరుకాని పక్షంలో 16న ట్యాబ్లెట్లు ఇస్తామని చెప్పారు. ఆల్బెండజోల్ టాబ్లెట్లను మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వేసుకోవాలని పిహెచ్‌సి వైద్యులు డాక్టర్ శివ చెన్నయ్య తెలిపారు. పిల్లల్లో ఉండే నులిపురుగుల నిర్మూలన చేయడం ద్వారా రక్తహీనత నుండి కాపాడవచ్చని అన్నారు. పిల్లలు అందరికీ మాత్రలు వేయాలని ఎంఇఒ కె నాగభూషణం కోరారు. కార్యక్రమంలో డాక్టర్ బాల రాజేశ్వరి, సూపర్వైజర్లు మదర్ షా, హరిబాబు, హెల్త్ ఎడ్యుకేటర్ అనురాధ పాల్గొన్నారు.

➡️