80 ఏళ్లు దాటితే ఇంటి వద్దే ఓటుహక్కు

మాట్లాడుతున్న కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి
ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో స్పెషల్‌ సమ్మరి రివిజన్‌-2024కు సంబంధించి ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అన్ని ప్రక్రియలు పూర్తిచేసి, 2024 జనవరి 5వ తేదీన తుది ఓటర్ల జాబితాను రూపొందించేందుకు అవసరమైన అన్ని చర్యలూ పకడ్బందీగా తీసుకోవాలని ఇఆర్వోలు, ఎఇఆర్వోలకు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో ఎస్‌ఎస్‌ఆర్‌ 2024పై సమీక్షించారు. కేంద్ర ఎన్నికల బృందం ఈ నెల 22, 23 తేదీల్లో జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలో ఓటర్ల జాబితాకు సంబంధించిన వివరాలు, ఎస్‌ఎస్‌ఆర్‌ 2024 ప్రక్రియ సంబంధించిన వివరాలపై నియోజకవర్గాల వారీగా సమీక్షించి సూచనలు చేశారు. 80 ఏళ్లు దాటిన వారు, విభిన్నప్రతిభావంతుల ఓటర్లు కోరితే ఇంటి వద్దనే వారితో బ్యాలెట్‌ పేపరుతో ఓటు వేయించాల్సి ఉంటుందని, కావున సంబంధిత ఓటర్ల వివరాలను మరోసారి పూర్తి స్థాయిలో పరిశీలించాలని చెప్పారు. ఓటర్ల జాబితాలో జెండర్‌ రేషియో, ఈపీ రేషియో నిర్దేశిత స్థాయిలో ఉండేలా పరిశీలించాలన్నారు. సమీక్షలో సంయుక్త కలెక్టర్‌ జి. రాజకుమారి, నగర కమిషనర్‌ కీర్తీ చేకూరి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ, డిఆర్‌ఒ కె.చంద్రశేఖరరావు, ఇఆర్వోలు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు రవిందరరావు, లక్ష్మీకుమారి, ఆర్డీవో కె.శ్రీకర్‌, జిఎంసి అడిషనల్‌ కమిషనర్‌ లక్ష్మీ శివజ్యోతి, డిఆర్డీఏ పీడీ హరిహరనాధ్‌ పాల్గొన్నారు.

➡️