వాహన తనిఖీల్లో రూ.8 లక్షలు స్వాధీనం

ప్రజాశక్తి -యంత్రాంగం :వాహన తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా లింగాలలో ఎలాంటి రసీదులు లేకుండా కారులో తీసుకెళుతున్న రూ.7 లక్షల నగదును సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ కృష్ణయ్య యాదవ్‌ తెలిపారు. వాహన తనిఖీల్లో భాగంగా అనంతపురం జిల్లా ముదిగుబ్బ నుంచి గుంటూరుకు వెళుతున్న కారును పరిశీలించగా అందులో నగదు పట్టుబడిందన్నారు. పట్టుబడిన నగదును సీజ్‌ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు.
విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండల పరిధిలోని సమతానగర్‌ జంక్షన్‌ వద్ద తనిఖీలు నిర్వహించిన ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ ఓ వ్యక్తి నుంచి రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకుంది. గాజువాక ఆటోనగర్‌లో నివాసముంటున్న రాహుల్‌ పాత్రో తన కారులో పెదగంట్యాడ వైపు వెళుతుండగా సమతానగర్‌ జంక్షన్‌ వద్ద తనిఖీలు చేపట్టగా నగదు ఉండడంతో ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ సభ్యులు పట్టుకున్నారు. రిజిస్ట్రేషన్‌ నిమిత్తం పెదగంట్యాడ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళుతున్నానని ఆ వ్యక్తి వివరించారు. వాటికి సంబంధించిన ఆధారాలు చూపకపోవడంతో నగదును స్వాధీనం చేసుకుని, అతనిపై కేసు నమోదు చేసినట్లు ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ సభ్యులు తెలిపారు.

➡️