8 గ్రామాలను హడలెత్తించిన ఏనుగుల గుంపు

Dec 11,2023 16:21 #chitoor, #elephant
  • లక్షల రూపాయల పంట నష్టం

ప్రజాశక్తి వి కోట : మండలంలోని ఎనిమిది గ్రామాల్లో ఏనుగుల గుంపు సోమవారం స్వైర విహారం చేసి లక్షల రూపాయల పంటలను నష్టపరిచాయి. సోమవారం వేకువ జామున గ్రామాల్లోకి చొరబడిన ఏనుగుల గుంపును చూసి గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏనుగుల గుంపును అడవిలోనికి మళ్ళించేందుకు అటవీశాఖ సిబ్బంది ఎంత ప్రయత్నించినా అవి దూచుకుంటూ పంట పొలాల్లోకి రావడంతో వాటిని అడ్డుకోలేక వారు చేతులెత్తేశారు. చివరకు గ్రామస్తుల సహకారంతో అటవీ శాఖ సిబ్బంది అరుపులు డప్పు శబ్దాలతో బాణాలు కాల్చుతూ ఏనుగుల గుంపును అడవిలోనికి తరలించారు. గత రెండు నెలలుగా వీకోట, బైరెడ్డిపల్లి మండలాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న ఈ ఏనుగుల గుంపు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సోమవారం దానమయ్యగారిపల్లి, కొమ్మరమడుగు ,నక్కనపల్లి, మోట్లపల్లి ,బాలేంద్రపల్లి, ఎర్రినాగేపల్లి ,వడ్డిపల్లి తదితర గ్రామాలలోని పంట పొలాలపై ఏనుగుల గుంపు చొరబడ్డాయి. ఈ దాడుల్లో టమోటా, బీన్స్, మొక్కజొన్న , అరటి తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏనుగుల భారీ నుండి తమకు శాశ్వత పరిష్కారం కల్పించాలని, పంట నష్టపోయిన గజభాదిత రైతులకు నష్టపరిహారం సత్వరం అందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

➡️