69 వేల మంది న్యాయమూర్తులు అవసరం

Dec 17,2023 11:18 #judges, #Law Commission
  • ఇప్పుడున్నది 25వేల మంది మాత్రమే
  • న్యాయవ్యవస్థ స్థితిగతులపై నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ  :    పది లక్షల మంది జనాభాకు 10 మంది న్యాయమూర్తుల నుండి 50 మంది న్యాయమూర్తులకు పెంచాలని ముప్పయ్యేళ్ల క్రితమే లా కమిషన్‌ సిఫార్సు చేసినా ఇంతవరకు అది కార్య రూపం దాల్చలేదని ఓ నివేదిక వెల్లడించింది. మంజూరైన మొత్తం 25,081 మంది న్యాయమూర్తుల పోస్టులకు గాను జిల్లాల న్యాయ స్థానాల్లో 5,300 మంది జడ్జిల కొరత ఉంది, ఉత్తరప్రదేశ్‌ (1,204), బీహార్‌ (460) రాష్ట్రాల్లో గరిష్టంగా ఖాళీలు ఉన్నాయని ‘న్యాయ వ్యవస్థ స్థితి’ పేరుతో విడుదలైన నివేదిక పేర్కొంది.

ఈ 5,300 ఖాళీల్లో 1,788 ఖాళీలు (21శాతం) జిల్లా జడ్జి కేడర్‌ స్థాయిలో ఉన్నాయి , మొత్తం మంజూరైన 16,694 మంది సివిల్‌ జడ్జీల పోస్టులకు గాను 8,387 సివిల్‌ జిల్లా జడ్జీలకు గాను 3,512 ఖాళీలు (21 శాతం) ఉన్నాయని ఆ నివేదిక పేర్కొంది. జడ్జీల రెగ్యులర్‌ రిక్రూట్‌మెంట్‌ ఆవశ్యకతను ఇది ఎత్తి చూపింది.

”హైకోరుల్లో 1,114 మంది న్యాయమూర్తులకు గాను 347 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు 34 మంది న్యాయమూర్తులతో పని చేస్తోంది. 2002లో ఆల్‌ ఇండియా జడ్జీల సంఘం వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియాలో సుప్రీంకోర్టు లా కమిషన్‌ సిఫార్సును ఆమోదించింది . న్యాయమూర్తుల సంఖ్యను మిలియన్‌ జనాభాకు 13 మంది న్యాయమూర్తులుగా ఉన్న నిష్పత్తి నుండి 50కి పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ప్రస్తుతం, మిలియన్‌ జనాభాకు 14.2 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. పెరిగిన జనాభాను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం 1,392 మిలియన్ల జనాభా కలిగి ఉన్న భారతదేశానికి మొత్తం 69,600 మంది న్యాయమూర్తులు అవసరమని నివేదిక పేర్కొంది.

➡️