లక్నోజిల్లా జైల్లో 63 మందికి హెచ్‌ఐవి

Feb 5,2024 16:57 #HIV, #Lucknow District Jail

లక్నో : దేశంలో మరోసారి హెచ్‌ఐవి కేసులు వెలుగుచూశాయి. లక్నో జిల్లా జైలులో 63 మంది ఖైదీలకు హెచ్‌ఐవి సోకిందని తాజాగా జైలు అధికారులు వెల్లడించారు. గతేడాది డిసెంబరులో ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా అప్పుడు 36 మందికి హెచ్‌ఐవి పాజిటివ్‌ అని తేలిందని.. ప్రస్తుతం జైలులో హెచ్‌ఐవి సోకిన వారి సంఖ్య 63కి చేరిందన్నారు.  సెప్టెంబర్‌ నుంచి హెచ్‌ఐవి టెస్టింగ్‌ కిట్స్‌ లేకపోవడం వల్లే.. పరీక్ష నిర్వహణ ఆలస్యమైందని..ఎట్టకేలకు డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించగా 63 మందికి పాజిటివ్ అని తేలిందనా్నరు. హెచ్‌ఐవి సోకిన ఖైధీలలో ఎక్కువమంది మాదక ద్రవ్య వ్యసనం కలిగిన వారేనని జైలు అధికారులు పేర్కొన్నారు. జైలులోకి రాకముందు వారు వాడిన సిరంజీల వల్ల కూడా ఆ ఖైదీలకు హెచ్‌ఐవి సోకి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నమన్నారు.  జైలులోకి వచ్చిన తర్వాత ఏ ఖైదీకి కూడా హెచ్‌ఐవి సోకలేదని తెలిపారు. హెచ్‌ఐవి సోకిన ఖైదీలందరికీ లక్నోలోని ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నామని, వారి ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. గత ఐదేళ్లలో హెచ్‌ఐవి ఇన్ఫెక్షన్‌ కారణంగా మరణాలు సంభవించలేదని జైలు యంత్రాగం తెలిపింది. జైలులో ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

➡️