52 శాతం పెరిగిన కోవిడ్‌ కొత్త కేసులు : డబ్ల్యుహెచ్‌ఓ వెల్లడి

న్యూఢిల్లీ : గత నెల రోజులుగా ప్రపంచవ్యాప్తంగా కొత్త కోవిడ్‌ కేసుల సంఖ్య 52 శాతం పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) వెల్లడించింది. 8,50,000కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపింది. అయితే, గత 28 రోజుల కాలంతో పోలిస్తే, కొత్త మరణాల సంఖ్య 8శాతం తగ్గింది. 3వేల మంది ఈ కాలంలో మరణించారని డబ్ల్యుహెచ్‌ఓ తన తాజా ప్రకటనలో తెలిపింది. కోవిడ్‌ మొదటిసారి తలెత్తినప్పటి నుండి తాజాగా డిసెంబరు 17 వరకు 77.2 కోట్ల మందికి కోవిడ్‌ వచ్చింది. దాదాపు 7 కోట్ల మరణాలు సంభవించాయి. 118000 మంది ఆస్పత్రి పాలయ్యారని, 1600కి పైగా ఐసియులు ఏర్పాటు చేశారని డబ్ల్యుహెచ్‌ఓ పేర్కొంది. అంటే ప్రపంచవ్యాప్తంగా వరుసగా 23, 51 శాతం కేసులు పెరిగాయని తెలిపింది. అయితే ప్రస్తుతం వేస్తున్న వ్యాక్సిన్లు అన్ని రకాల తీవ్ర వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తున్నాయని ఆ ప్రకటన తెలిపింది. కోవిడ్‌ వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు మాత్రమే కాకుండా ఫ్లూ, ఆర్‌ఎస్‌వి, పిల్లల్లో చిన్నతనంలో వచ్చే న్యుమోనియా వంటి వ్యాధులు బాగా పెరుగుతున్నాయని తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో వున్న సాధనాలను ఉపయోగించి ఇన్ఫెక్షన్లు, తీవ్ర వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని డబ్ల్యుహెచ్‌ఓ ఆదేశించింది.

➡️