500 మంది ఉద్యోగులపై స్నాప్‌చాట్‌ వేటు

Feb 6,2024 21:01 #Business

ముంబయి: ప్రపంచవ్యాప్తంగా టెక్‌ రంగంలో లేఆఫ్స్‌ పర్వం కొనసాగుతోంది. 2023లో టెక్‌ దిగ్గజాలతో పాటు స్టార్టప్‌లు సైతం ఎడాపెడా మాస్‌ లేఆఫ్స్‌కు తెగబడ్డాయి. ఇక కొత్త ఏడాది సైతం టెకీలపై లేఆఫ్స్‌ కత్తి వేలాడుతోంది. 2024లో అడుగుపెట్టామో లేదో తొలి మాసంలోనే వేల సంఖ్యలో ఉద్యోగులు కొలువులను కోల్పోయారు. తాజాగా ఈ ఏడాది రెండో మాసంలో ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ ‘స్నాప్‌చాట్‌’ మాతఅ సంస్థ ‘స్నాప్‌’ ఫ్రెష్‌ లేఆఫ్స్‌ ప్రకటించింది. వ్యయాల తగ్గింపు ప్రణాళికల్లో భాగంగా ఉద్యోగులను తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం మందిని తొలగించనున్నట్టు ప్రకటించింది. సోమవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఉద్యోగుల తొలగింపు విషయాన్ని వెల్లడించింది. కంపెనీకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న ఫుల్‌టైమ్‌ ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగించనున్నట్టు వెల్లడించింది. సంస్థలో 5,367 మంది ఫుల్‌టైమ్‌ ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ తాజా నిర్ణయంతో 540 మంది ఉద్యోగులు కొలువుల్ని కోల్పోనున్నారు. ఇక స్నాప్‌తోపాటు ఓక్టా ఇన్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ కూడా ఈ నెల ప్రారంభంలోనే లేఆఫ్స్‌ ప్రకటించింది. కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడానికి సిబ్బందిలో ఏకంగా 7 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ నిర్ణయంతో 400 మంది ఉద్యోగులు కొలువులు కోల్పోనున్నారు.

➡️