నాగ్‌పూర్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

maharastra accident

ఆరుగురు మహిళలు సహా తొమ్మిది మంది సజీవ దహనం
మరో ముగ్గురి పరిస్థితి విషమం

నాగ్‌పూర్‌ : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ జిల్లాలో పేలుడు పదార్థాల తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మహిళలతో సహా తొమ్మిది మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. చక్దోV్‌ా గ్రామంలో ఉన్న సోలార్‌ ఇండిస్టీస్‌ ఇండియా లిమిటెడ్‌ బిల్డింగ్‌ నంబర్‌ హెచ్‌ఆర్‌-సిపిసిహెచ్‌-2 (మిక్సింగ్‌, మెల్టింగ్‌, కాస్టింగ్‌)లో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించిందని ఆ సంస్థ సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ ఆశీష్‌ శ్రీవాస్తవ ఒక ప్రకటనలో తెలిపారు. బొగ్గు గనుల్లో ఉపయోగించే బూస్టర్లను ఉత్పత్తి చేసే భవనంలో ఈ సంఘటన జరిగిందని, తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారని పేర్కొన్నారు. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. యువరాజ్‌ చారోడ్‌, ఒమేశ్వర్‌ మచ్చిర్కే, మితా ఉయికే, ఆర్తి సహారే, శ్వేతాలి మార్బాటే, పుష్పా మనాపురే, భాగ్యశ్రీ లోనారే, రుమితా ఉయికే, మౌసం పాట్లేగా మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ప్రమాద సమయంలో మొత్తం 12 మంది కార్మికులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. గాయపడిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ కంపెనీలో సాయుధ బలగాల కోసం డ్రోన్లు, పేలుడు పదార్థాలను తయారు చేస్తారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నిర్ణయించినట్లు ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. నష్టాన్ని అంచనా వేస్తున్నామని, పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ హర్ష్‌ పొద్దార్‌ తెలిపారు.

లోపలికి వెళ్లనివ్వరు.. మా వాళ్లను చూడనివ్వరు… : మృతుల కుటుంబ సభ్యుల ఆందోళన

నాగ్‌పూర్‌ : ఫ్యాక్టరీలోకి అనుమతించడం లేదని, ప్రాణాలు కోల్పోయిన తమ వారి సమాచారం కూడా ఇవ్వడం లేదంటూ మృతుల కుటుంబ సభ్యులు సంస్థ ఆవరణలో ఆదివారం ఆందోళన చేశారు. సోలార్‌ ఇండిస్టీస్‌ ఇండియా లిమిటెడ్‌లో జరిగిన పేలుడులో సజీవ దహనమైన వారి మృతదేహాలను ఫ్యాక్టరీ ఆవరణలో ఉంచడంపై బంధువులు, స్ధానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ ఆవరణలోకి అనుమతించాలని డిమాండ్‌ చేస్తూ బాధితుల కుటుంబ సభ్యులు, స్థానికులు యూనిట్‌ ప్రవేశ ద్వారం వద్ద బైఠాయించారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఫ్యాక్టర్టీ వద్దకు చేరుకున్నా.. తమను లోపలకు అనుమతించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘నాకు ఏమీ వద్దు.. నా కుమార్తె మృతదేహాన్ని అప్పగించండి’ అని మృతుల్లో ఒకరైన 22 ఏళ్ల ఆర్తి తండ్రి నీలకంఠరావు సహారే దీనంగా వేడుకోవడం అందర్ని కలచి వేసింది. గతంలో పక్షవాతానికి గురికావడంతో సహారే కాళ్లు చచ్చుబడిపోయాయి. ప్రమాద వార్త తెలిసిన వెంటనే సంఘటనా స్థలికి సహారే చేరుకున్నారు. ఆర్తి సంపాదనతోనే తమ కుటుంబం గడుస్తుందని, మాటలు రాని తల్లికి, చెల్లికి ఆర్తి అండగా ఉండేదని గుర్తు చేసుకుంటూ సహారే కన్నీరు పెట్టడం చూపరులను కంటతడిపెట్టించింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన 32 ఏళ్ల రుమితా ఉయికి ఆదివారం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆమె తండ్రి దేవిదాస్‌ ఇరపాటి ఫ్యాక్టరీ వద్ద ఆందోళనలో ఉన్నారు. ప్రమాదం గురించి ఫ్యాక్టరీ నుంచి ఎలాంటి సమాచారం లేదని, ఇతరుల ద్వారా ప్రమాదం గురించి తెలుసుకుని ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. రుమితకు ఇద్దరు కుమారు ఉన్నారని, భర్త వ్యవసాయ కార్మికుడని చెప్పారు. ఆదివారం తమ ఇంటికి రావాల్సి ఉందని, అంతలోనే ప్రమాదంలో మరణించిందని గద్గద స్వరంతో చెప్పారు. ‘రుమిత మృతదేహాన్ని మాకు ఎప్పుడు అప్పగిస్తారో తెలియదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన వారి కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఇదేవిధమైన ఆందోళన వ్యక్తం చేశారు.

➡️