5,423 మారుమూల గ్రామాల్లో 4జి సేవలు

  •  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని పేజ్‌-2 కింద 5,423 మారుమూల గ్రామాల్లో 4జి సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. 4జి సర్వీసులకు సంబంధించి నెట్‌వర్క్‌ టవర్ల ఏర్పాటు, ఇతర పనుల ప్రగతిపై గురువారం ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కాన్ఫిరెన్స్‌లో పాల్గొన్న సిఎస్‌ జవహర్‌రెడ్డి రాష్ట్రంలోని ప్రగతి గురించి ఆయనకు వివరించారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామాలు, సరిహద్దు గ్రామాల్లో 4జి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నామన్నారు. యూనివర్సల్‌ సర్వీసు ఆబ్లిగేషన్‌ ఫండ్‌ (యుఎస్‌ఒఎఫ్‌) ద్వారా బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎయిర్‌టెల్‌, జియో నెట్‌వర్క్‌ సంస్థలకు టవర్ల ఏర్పాటుకు సంబంధించి అనుమతులు జారీ చేసి, స్థలాలను అప్పగిస్తున్నామని, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,329 టవర్ల ఏర్పాటుకు దరఖాస్తులు రాగా.. వాటిలో 2,316 స్థలాలు అప్పగించామని ఆయన తెలియజేశారు. 15 రోజులకోసారి జిల్లా కలెక్టర్లతో సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బిఎస్‌ఎన్‌ఎల్‌లో క్షేత్రస్థాయిలో సిబ్బంది తక్కువుగా ఉన్నారని, తగినంత సిబ్బందిని సమకూర్చితే పనులు మరింత వేగవంతంగా పూర్తి చేస్తామని చెప్పారు. దీనిపై స్పందించిన కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ.. బిఎస్‌ఎన్‌ఎల్‌ రాష్ట్రస్థాయి అధికారులు వెంటనే ఎపి సిఎస్‌తో చర్చలు జరిపి, తగిన సిబ్బందిని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు రాజీవ్‌ గౌబ మాట్లాడుతూ.. మారుమూల గ్రామల ప్రజలకు 4జి సర్వీసులు అందించేందుకు దేశవ్యాప్తంగా సుమారు 27 వేల మొబైల్‌ టవర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. టవర్ల ఏర్పాటుకు సంబంధించి ఏమైనా అడ్డంకులుంటే వెంటనే అటవీ, తదితర శాఖలతో మాట్లాడి, పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

➡️