జెఎన్‌యులో దాడికి నాలుగేళ్లు

Jan 6,2024 10:30 #attack, #JNU

ఇప్పటికీ ఎబివిపి గూండాలపై చర్యలు శూన్యం

ఢిల్లీ పోలీసులపై జెఎన్‌యుటిఎ మండిపాటు

న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మకమైన జెఎన్‌యు క్యాంపస్‌లో ముసుగులు ధరించి ఎబివిపి గూండాలు దాడికి పాల్పడిన ఘటనకు నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకూ ఎబివిపి గూండాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఢిల్లీ పోలీసులపై జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ (జెఎన్‌యుటిఎ) ఆవేదన వ్యక్తం చేసింది. ఎబివిపి గూండాలు భయంకరంగా దాడులు చేసిన రాత్రి ఇంకా తమ కళ్లముందు ఉందని జెఎన్‌యుటిఎ అధ్యక్షులు డికె లోబియాల్‌ శుక్రవారం న్యూస్‌క్లిక్‌తో మాట్లాడుతూ గుర్తు చేసుకున్నారు. దాడికి నాలుగేళ్లు పూర్తయినా బాధిత ఉపాధ్యాయులు, విద్యార్థులకు న్యాయం చేయడంలో ఢిల్లీ పోలీసులకు, విశ్వ విద్యాలయ అధికారులకు ఎలాంటి ఆసక్తి లేదని విమర్శించారు. ‘ప్రపంచవ్యాప్తంగా ఈ హింసాకాండ చర్చనీయాంశమైనప్పటికీ, ఈ దాడిపై ఛార్జిషీట్‌ నమోదు చేయడం కానీ, దర్యాప్తును పూర్తి చేయడం కానీ జరగపోవడం మాకు ఆందోళన కలిగిస్తుంది’ అని అన్నారు. విచారణ ప్రారంభ సమయంలో బాధితుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేసుకున్న పోలీసులు తరువాత ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. దాడికి ప్రణాళిక వేసిన ‘ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌’, ‘యూనిటీ ఎగైనస్ట్‌ లెఫ్ట్‌’ అనే వాట్సప్‌ గ్రూపు సభ్యుల సమాచారాన్ని కూడా ఢిల్లీ పోలీసులు సంపాదించలేకపోయారని ఆరోపించారు. గూండాలపై ఎలాంటి కనీస చర్యలు లేకపోవడం ఈ దాడిలో జెఎన్‌యు అధికారులకు, ఢిల్లీ పోలీసులకు కూడా భాగస్వామ్యం ఉందనే మా వాదనకు బలం చేకూరుస్తుందని అన్నారు. ‘ఎబివిపి గూండాలు దాడిచేస్తారనే ముందస్తు సమాచారం ఉన్నా.. గూండాల గుంపును క్యాంపస్‌లోకి అనుమతించారు. హింసను నిరోధించడానికి ఎలాంటి నివారణ చర్యలు తీసుకోలేదు. దాడి జరుగుతున్న సమయంలో సహాయం కోసం చేసిన అనేక ఫోన్‌కాల్స్‌కు ప్రతిస్పందించడంలో విఫలమయ్యారు’ అని పోలీసులపై విమర్శలు చేశారు. జెఎన్‌యులో నాలుగేళ్ల క్రితం జరిగిన దాడి ‘అసమ్మతిని అణిచివేయడానికి అధికారాన్ని దుర్వినియోగం చేయడం’గా జెఎన్‌యుటిఎ నమ్ముతోందని డికె లోబియాల్‌ తెలిపారు. జెఎన్‌యులో ఫీజులు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్న పేరుతో జనవరి 5, 2020 రాత్రి 7 గంటల సమయంలో సుమారు 50 మంది ఉన్న ఎబివిపి గూండాల గుంపు లాఠీలు, కర్రలు, యాసిడ్‌తో దాడికి దిగింది. ఈ గుంపులో మహిళలు కూడా ఉన్నారు. సుమారు 3 గంటల పాటు దాడి కొనసాగించింది. వామపక్ష సంస్థల నాయకులు, విద్యార్థులే లక్ష్యంగా ఈ దాడి జరిగింది. ఈ దాడిలో 39 మంది గాయపడ్డారు. ఇప్పటి వరకూ నిందితుల్ని అరెస్టు చేయడం కానీ, నిర్బంధంలోకి తీసుకోవడం కానీ జరగలేదు.

➡️