32 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి

Dec 5,2023 22:23

ధర్మవరంలో ఎడ్లబండ్ల ర్యాలీని ప్రారంభిస్తున్న నాయకులు

        నల్లచెరువు : జిల్లాలోని 32 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ఎపి రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బడాసుబ్బిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రైతు సంఘం ఆధ్వర్యంలో నాయకులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్‌ రవికుమార్‌కు మంగళవారం సమర్పించారు. ఈసందర్భంగా బడాసుబ్బిరెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురవక జిల్లా వ్యాప్తంగా 2 . 84 లక్షల హెక్టార్లు సాగుకు కాను కేవలం 98,500 హెక్టార్లలో మాత్రమే సాగు అయిందన్నారు. 65 శాతం భూములన్నీ బీడు భూములుగా మారిపోయాయన్నారు. రైతులు పంట సాగుకు తెచ్చిన అప్పులు తీర్చలేక వలసలు వెళ్లారన్నారు. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని మండలంలో కరువు సహాయకచర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ ఏడాది పంట పెట్టి నష్టపోయిన రైతులకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం ఎకరానికి 40 వేల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలన్నారు.భూమిని చదును చేసి పంట పెట్టేందుకు విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసి వర్షాలు పడక పంట వేయక నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేల రూపాయలను ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం సభ్యులు శ్రీరాములు, మండల పరిధిలోని రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు. ధర్మవరం టౌన్‌ : జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న డిమాండ్‌ చేశారు. ఇసుక రవణా చేస్తూ జీవనం సాగించే ఎడ్లబండ్ల యజమానులకు అండగా మంగళవారం రైతు సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఎడ్ల బండ్ల తో ధర్మవరం పట్టణంలో ర్యాలీ, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ వద్ద నుంచి ప్రారంభమై ర్యాలీ కదిరి గేటు చౌడమ్మ గుడి గాంధీనగర్‌ ఎన్టీఆర్‌ సర్కిల్‌ కళా జ్యోతి సర్కిల్‌ కాలేజ్‌ సర్కిల్‌ మీదుగా సాగింది. మూడు కిలోమీటర్ల మేర ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులు కర్షకులు పట్ల ఉదాసీన వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. 32 మండలాలు ఉండగా అందులో 21 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి మిగిలిన 11 మండలాలను చేర్చకపోవడం విచారకరమన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే జగన్‌ రైతులను నట్టేట ముంచారన్నారు. జగన్‌ ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే భవిష్యత్తులో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పట్టణానికి చెందిన ఎద్దులబండ్ల యజమానులు పట్టణానికి సమీపంలో ఉన్న పోతుల నాగేపల్లి వద్ద గల చిత్రావతిలోకి వెళ్లి ఇసుకను బండ్ల ద్వారా తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితి ఉందన్నారు. గ్రామానికి చెందిన అగ్రవర్ణాలకు చెందిన కొందరు ఎద్దుల బండ్ల యజమానులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎద్దుల బండి యజమానులపై దాడులు చేస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కొత్తపేట మారుతి, సిపిఎం నాయకులు ఎస్‌హెచ్‌. బాషా, పట్టణ కార్యదర్శి నామాల నాగార్జున, సిఐటియు మండల అధ్యక్షులు ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి అయూబ్‌ ఖాన్‌, నాయకులు వెంకటస్వామి, రైతులు శ్రీనివాస్‌ రెడ్డి, అంజి, రవి, వెంకటేష్‌, నాగమణి, తదితరులు పాల్గొన్నారు. గాండ్లపెంట : గాండ్లపెంట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని రైతు సంఘం నాయకులు గంగన్న, ఖాదర్‌ బాషా డిమాండ్‌ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మూడు సంవత్సరాల నుంచి పంట సాగు చేసిన ప్రతిరైతు నష్టపోయారన్నారు. ప్రభుత్వం స్పందించి గాండ్లపెంటను కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు ఈ కార్యక్రమంలో మండల రైతులు ఇస్మాయిల్‌, ఫక్రుద్దీన్‌, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిలమత్తూరు : ఈ ఏడాది పంట సాగుచేసి నష్టపోయిన రైతులుకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం ఎకరానికి 45 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని వ్యకాసం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటను సాగు చేసేందుకు భూమిని దున్ని చదును చేసుకొని వర్షాభావం కారణంగా పంట సాగుచేయలేక పోయిన రైతులకి ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పంటనష్టపోయిన ఉద్యాన వన రైతులకు ఎకరానికి 50 వేల రూపాయలు సష్టపరిహారం ఇవ్వాలన్నారు. జిల్లాలో మల్బరీ రైతులకు రావాల్సిన ఇన్సెంటివ్‌ ఇవ్వాలన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టే విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్‌ నాగరాజుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు లక్ష్మినారాయణ, చందు తదితరులు పాల్గొన్నారు.

➡️