రోజుకు 31 మంది అన్నదాతల ఆత్మహత్య

Dec 6,2023 10:25 #formers, #Suicide

 

2022లో 11,290 బలవన్మరణం

వీరిలో 6083 మంది వ్యవసాయ కార్మికులే

న్యూఢిల్లీ : దేశంలో అన్నదాతల బలవన్మరణాలు ఏటికేడు పెరుగుతూనేవున్నాయి. జాతీయ నేర రికార్డుల సంస్థ (ఎన్‌సిఆర్‌బి) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం సగటున ప్రతి రోజూ 31 మంది అన్నదాతలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఎన్‌సిఆర్‌బి నివేదిక ప్రకారం 2022లో వ్యవసాయ రంగంలో 11,290 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో 5,207 మంది రైతులు కాగా 6,083 మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. 2021తో పోలిస్తే గత ఏడాదిలో ఆత్మహత్యలు 3.75 శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది. 2021లో 10,881 మంది కర్షకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో 5,318 మంది రైతులు, 5,563 మంది వ్యవసాయ కార్మికులున్నారు. రైతులు కంటే వ్యవసాయ కార్మికులు ఎక్కువగా ఆత్మహత్యకు పాల్పడటం 2020 తరువాత పెరుగుతూవస్తోంది. 2020లో వ్యవసాయ రంగంలో 10,677 మంది ఆత్యహత్యకు పాల్పడ్డారు. వీరిలో 5,579 మంది రైతులు కాగా, 5,098 మంది వ్యవసాయ కార్మికులు. 2019లో వ్యవసాయరంగంలో మొత్తంగా 10,281 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో 5,957 మంది రైతులు, 4,324 మంది వ్యవసాయ కార్మికులు. అంతకు ముందు ఏడాది అంటే 2018లో మొత్తంగా 10,349 మంది ఆత్యహత్యకు పాల్పడ్డారు. వీరిలో 5,763 మంది రైతులు, 4,586 మంది వ్యవసాయ కార్మికులున్నారు.

➡️