28 నుంచి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు : డిఇఒ

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ ఈ నెల 28వ తేదీ నుంచి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు పట్టణంలోని ఇన్ఫాంట్‌ జీసస్‌ హైస్కూల్‌లో స్కూల్‌ గేమ్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అండర్‌-14 బాలికల 67వ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరాం పురుషోత్తం, ఆర్‌ఐపి భానుమూర్తి రాజు తెలిపారు. పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు వారు గురువారం క్రీడా మైదానంతో పాటు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు రాజంపేటలో నిర్వహిస్తుండటం గర్వకారణమని తెలిపారు. గతంలో జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీలు నిర్వహించిన అనుభవంతో ఈ పోటీలను సమర్ధవంతంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ పోటీలలో దేశ వ్యాప్తంగా 27 యూనిట్లు, 324 మంది క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు జడ్పీ బాలికల పాఠశాల ఇంటిగ్రేటెడ్‌ బిసి హాస్టల్‌, ఇన్ఫాంట్‌ జీసస్‌ హైస్కూల్‌ వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉత్తర, దక్షిణ భారత ఆహారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. హెల్త్‌ క్యాంపు, శానిటేషన్‌ కమిటీలు ఏర్పాటు చేశామని, వారి వారి కమిటీల బాధ్యతలను వారు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. జట్లతోపాటు విచ్చేసే అధికారులకు లాడ్జీలలో 40 గదులు ఏర్పాటు చేశామని, ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సెక్రటరీ సురేష్‌ కుమార్‌ హాజరవుతారని పేర్కొన్నారు. 27వ తేదీ సాయంత్రం రాజంపేట పట్టణంలో క్రీడాకారులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో డివైఇఒ వరలక్ష్మి, ఎస్‌జిఎఫ్‌ కార్యదర్శి వసంత పాల్గొన్నారు.

➡️