26 నాటికి క్లయిమ్‌ల పరిష్కారం

ఈనెల 26వ తేదీ నాటికి ఓటర్ల జాబితాలో

సమావేశంలో మాట్లాడుతున్న డిఆర్‌ఒ గణపతిరావు

  • జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం

ఈనెల 26వ తేదీ నాటికి ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, ఇతర సవరణల కోసం వచ్చిన క్లయిమ్‌లను పూర్తిగా పరిష్కరిస్తామని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు తెలిపారు. అనంతరం తుది ఓటర్ల జాబితాను జనవరి ఐదో తేదీన వెలువడనుందని చెప్పారు. పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో 23వ వారపు సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ప్రస్తుతం చేపడుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై అంశాల వారీగా సమీక్షించారు. దాదాపు అన్ని క్లయిమ్‌లు పూర్తయ్యాయని, కేవలం ఒకట్రెండు శాతం దరఖాస్తులను మాత్రమే పరిష్కరించాల్సి ఉందని వివరించారు. ఇంకా అర్హత ఉన్న వారు ఓటు హక్కు పొందేందుకు ఫారం-6ను నేరుగా గానీ, ఆన్‌లైన్‌లో గానీ ఇవ్వవచ్చని తెలిపారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వాటిని పరిశీలించి, సాధారణ ఎన్నికల నామినేషన్లకు పది రోజుల ముందు ప్రచురించే అనుబంధ (సప్లిమెంట్‌) జాబితాలో చేర్చనున్నట్ల చెప్పారు. సమావేశంలో వైసిపి నాయకులు రౌతు శంకరరావు, టిడిపి నాయకులు రామరాజు, సి-సెక్షన్‌ సూపరింటెండెంట్‌ ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️