వెనిజులా కుట్రకు 22ఏళ్ళు !

Apr 15,2024 09:36 #22 years, #Venezuelan conspiracy!

అయినా మారని ఆమెరికా తీరు

కారకస్‌ : ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు హ్యుగో చావెజ్‌ను అధికారం నుండి కూలదోసేందుకు పెట్టుబడిదారీవర్గం జరిపిన కుట్రకు ఈ నెల 11తో 22ఏళ్లు నిండాయి. తమ ఆర్థికాధికారాలను కోల్పోతామన్న భయంతో వ్యాపార, వాణిజ్య వర్గాలు మితవాద మిలటరీ అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేశారు. 1999లో ఎన్నికైన చావెజ్‌, కార్మికులకు సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన పలు కార్యక్రమాలతో బలివేరియన్‌ విప్లవాన్ని ప్రారంభించారు. వెనిజులా ప్రజలను దారిద్య్రం నుండి బయటపడవేయాలన్నది తన లక్ష్యమని ప్రకటించారు. అక్షరాస్యతను విస్తరించాలని, ప్రజారోగ్యం, విద్య సేవలను మరింత మెరుగుపరచాలని భావించారు. రాజకీయాలను ప్రజాతంత్రీకరించాలనుకున్నారు. జాతీయ సంపదను ప్రజల చేతుల్లో పెట్టాలనుకున్నారు. 21వ శతాబ్దంలో సోషలిజం పేరుతో ఆయన తన ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే కుట్రదారులు సాధించిన విజయం నిలవలేదు. వందలు, వేల సంఖ్యలో వెనిజులన్లు బలివారియన్‌ విప్లవ ప్రయోజనాలను కాపాడుకునేందుకు వీధుల్లోకి వచ్చారు. తిరిగి చావెజ్‌ను అధికారంలో కూర్చోబెట్టారు. అమెరికా దన్నుతో సైనిక ముఠా పన్నిన కుట్ర కేవలం 48గంటల్లోనే వీగిపోయింది. ఈ కుట్ర సమాచారం అమెరికా అధ్యక్షుడు బుష్‌కు ముందే తెలుసునని వివరాలు బయటకు వచ్చాయి. చావెజ్‌ 2013లోనే మరణించినా వెనిజులాలో బలివేరియన్‌ విప్లవాన్ని కూలదోసే ప్రయత్నాలను అమెరికా సామ్రాజ్యవాదం విరమించలేదు. ప్రస్తుత మదురో ప్రభుత్వం అమెరికా కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ముందుకు సాగుతోంది.

➡️